ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండిలా

Health beauty |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 01:29 PM

మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉన్న కార్బోహైడ్రేట్లను విచ్చిన్నం చేయడానికి, గ్లూకోస్ తయారు చేయడంలో కాలేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కాలేయం పోషకాలను నిల్వచేసుకొని పిత్తాన్ని కలిగిస్తుంది. కాలేయం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మనం తీసుకునే ఆహార పదార్థాలను సరైన క్రమంలో జీర్ణం చేసి అందులో ఉన్న పోషకాలను రక్తంలోకి ప్రవహించేలా చేస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోతే ఎన్నో జీర్ణక్రియ సమస్యలు తలెత్తడంతో పాటు టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహరం పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాలేయం పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఏ విధమైన ఆహరం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


వెల్లుల్లి: వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వెల్లుల్లిలో అధికభాగం యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది కాలేయానికి ప్రమాదం కలిగించే బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తుంది.


ఓట్ మీల్: తరచూ మన ఆహారంలో భాగంగా ఓట్ మీల్ తీసుకోవటం వల్ల అధిక మొత్తంలో ఫైబర్ మన శరీరానికి అందుతుంది. ఓట్ మీల్ లో అధికభాగం ఫైబర్ తో పాటు, బీటా-గ్లూకాన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు జీర్ణక్రియను వేగవంతం చేయడంలో కాలేయానికి సహకరిస్తాయి. కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వులను కరిగించడంలో దోహదపడుతుందని పలు అధ్యయనాల్లో రుజువైంది.


చేపలు: కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా సాల్మన్ చేపలు అధిక భాగం ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. ఇవి మన కడుపులో ఏర్పడిన మంటను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అదే విధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఎంతో ఆరోగ్యకరమైన ఈ సాల్మన్ చేపలను వారంలో కనీసం 2 సార్లు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.


కాఫీ: ప్రతిరోజు కాఫీ తాగటం వల్ల మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజూ కాఫీ తాగడం వల్ల దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రభావం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల కాలేయంలో ఉన్న కొవ్వు పెరుగుదలను తగ్గించడమే కాకుండా, కాలేయంలో రక్షణాత్మక యాంటీఆక్సిడెంట్స్ పెంపొందుతాయి.


గ్రీన్ టీ: కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో అధికభాగం యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇవి కాలేయ ఆరోగ్యాన్ని ఉంచడంలో దోహదపడతాయి.


బెర్రీలు: బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ వంటి వివిధ రకాల బెర్రీలలో అధిక భాగం పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి. ఇవి కాలేయానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తాయి.


ద్రాక్ష: ద్రాక్ష కాలేయం దెబ్బ తినకుండా ఉండటానికి సహాయపడుతుంది. ద్రాక్ష, ద్రాక్ష రసం, విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాలేయంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.


గుడ్లు: గుడ్లలో సల్ఫర్ సమ్మేళనాలు, మిథైలేషన్ ఎలిమెంట్స్, గ్లూటాతియోన్, ప్రొటీన్లు విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి. గుడ్లలో కెరోటినాయడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తుంది.


గింజలు:సాధారణంగా గింజలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీరంలో ఏర్పడే మంటను తొలగించడంతో పాటు, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో వాల్నట్, బాదం వంటి కొన్ని గింజలను తినడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు:  ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, చిప్స్ వంటి ప్యాక్డ్ స్నాక్స్, గింజలలో కూడా కొవ్వులు అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే రొట్టెలు, పాస్తా, కేకులు వంటి పండి పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయానికి ప్రమాదం వాటిల్లుతుంది. అలాగే ఉప్పును కూడా తక్కువ తీసుకోవడం మంచిది. ఉప్పును ఎక్కువగా వాడేవారు కాలేయ సమస్యతో పాటు అధిక రక్తపోటును ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆల్కహాల్ సేవించే వారిలో కాలేయ పనితీరు క్రమంగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలు కూడా ఉండవచ్చు. అందుకే ఎంత తక్కువగా తాగితే అంత మంచిది.


కాలేయం దెబ్బతింటుందంటే సంకేతాలివే:  కాలేయం దెబ్బతినే ముందు పలు సంకేతాలు వస్తుంటాయి. వాంతులు, ఆకలి లేకపోవడం, అలసట, విరేచనాలు, కామెర్లు, నిరంతరం బరువు తగ్గడం, శరీరంలో దురద, పొత్తికడుపులో ద్రవ ఏర్పడటం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అనుమానం ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com