వైసీపీ సర్కార్ ఎన్నడూ లేని విధంగా కేంద్రం తీసుకొన్న నిర్ణయంతో ఇరకాటంలో పడే ప్రమాదం కనిపిస్తోంది. తాజాగా పెట్రోల్, డీజీల్ సుంకం తగ్గించాలని వైసీపీ సర్కార్ పై రాష్ట్రంలోని పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచని స్థితిని వైసీపీ సర్కార్ ఎదుర్కొంటోంది. కేంద్రం ఇందన ధరలు తగ్గించడంతో వినియోగదారులకు ఊరట లభించింది. ఈ నిర్ణయంతో జగన్ సర్కార్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ప్రతిపక్షాలు జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రం ధరలు తగ్గించినా.. ఏపీలో మాత్రం ప్రభుత్వం వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తున్నారు నేతలు. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ సర్కార్ టార్గెట్‌గా విమర్శలు చేశారు.
‘ఏం వైఎస్ జగన్ ఇప్పటికైనా మారవా. పెట్రోలుపై 31శాతం వ్యాట్ + రూ.4+రూ.1,డీజిల్ పై 22.5 శాతం వ్యాట్ +రూ.4, +రూ.1 పన్నులు వేసి 151 సీట్లిచ్చిన ప్రజలను బాదేస్తావా. ఓ వైపు కేంద్రం మరోవైపు పొరుగు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ఉపశమనం కలిగిస్తుంటే మీరు మాత్రం స్పందించరా. వ్యాట్ లో కనీసం 5 శాతంతో పాటు అదనంగా మీరు వేస్తున్న రూ.5 పన్ను తగ్గించినా లీటర్ కు రూ.10 భారం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ మరోవైపు లక్షా 10 వేల కోట్లు ఎరువులపై రాయితీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా ఏపీ ప్రజలపై మాత్రం మీరు కనికరం చూపరా. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి కుమ్ముడే కుమ్ముడు అంటూ మరింత కుమ్మేస్తారా’ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
మరోవైపు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్‌ని రూ..8.. డీజిల్ రూ.6 తగ్గించారని గుర్తు చేశారు. రిటైల్ ధరలు లీటర్ పెట్రోల్ రూ.9.5.. డీజిల్ రూ.7 తగ్గుతాయన్నారు. ఆరు నెలల్లో రెండు సార్లు భారీగా తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించారని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యాట్‌ని విపరీతంగా పెంచడంతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని విమర్శించారు. సీఎం జగన్ కేంద్రంలా భారీగా వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రజలపై పెట్రోభారం తగ్గించడం కోసం లీటర్ పెట్రోల్‌పై రూ.8 మేర, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. అంటే లీటర్ పెట్రోల్ ధర రూ.9.5 మేర, లీటర్ డీజిల్ ధర రూ.7 మేర తగ్గింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గనుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీలో వ్యాట్ ఎందుకు తగ్గించరని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి.