అంబేడ్కర్ పేరుపై జిల్లా ఏర్పాటుకు అనుకూలంగా, వ్యతిరేకంగా నిరసనలతో కోనసీమ జిల్లా హీటెక్కుతోంది. దీంతో పోలీసు శాఖ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కోనసీమ జిల్లాలో సోమవారం నుంచి వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కోనసీమలోని అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, కాట్రేనికొన, రావులపాలెం మండలాల్లో 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. కాబట్టి, ఈ ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కోనసీమ జిల్లా పేరు మార్పు ఆందోళనల నేపధ్యంలో శాంతిభద్రతల కోసం 450 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పొట్టి శ్రీరాములు, సత్యసాయిబాబా, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. కానీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుపై మాత్రం కొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.