ఏదైనా మన తలరాతను బట్టే ఉంటుందంటా. ఎంతచేసినా మనకు ఎంత రాసిపెట్టివుంటే అంతే దక్కుతుంది. ఏదైనా కాల మహిమా. ఇక వివరాలలోకి వెళ్లితే...పన్నెండేళ్ల క్రితం ఫ్లోరిడియన్‌కు చెందిన ఓ ప్రోగ్రామర్‌కి పిజ్జా తినాలనిపించింది. రెండు పిజ్జాలను కొనుగోలు చేయాలనుకున్నాడు. అనుకున్న మాదిరిగానే పిజ్జాలను కొనుగోలు చేశాడు. అయితే ఈ పిజ్జాల కోసం ఆయన బిట్ కాయిన్లను వాడాడు. క్రిప్టోలను వాడుతూ తొలిసారి ప్రపంచంలోనే అత్యంత రికార్డు స్థాయిలో ఈ కొనుగోలును చేపట్టాడు లాస్లో హన్యెక్జ్. కానీ ఇప్పుడు ఆ బిట్ కాయిన్ల ఖరీదు ఏకంగా రూ.2 వేల కోట్ల పైమాటే. అసలు పన్నెండేళ్ల క్రితం జరిగిన ఆ కథేంటి..? బిట్ కాయిన్ పిజ్జా డేను ఎందుకు హన్యెక్జ్ జరుపుకుంటున్నారో మనం ఓ సారి తెలుసుకుందాం..
హన్యెక్జ్ 2010 మే 18న రెండు పిజ్జాలను కొనుగోలు చేయాలనుకున్నాడు. వాటికి బిట్ కాయిన్ రూపంలో చెల్లింపులు చేయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని బిట్‌కాయిన్‌టాక్ డాట్ ఓఆర్‌జీ ఫోరమ్‌లో తెలిపాడు. ఎవరైతే తనకు ఈ ఆర్డర్ అందిస్తారో వారికి 10 వేల బిట్‌కాయిన్లను చెల్లించనున్నట్టు పేర్కొన్నాడు. పిజ్జాలను అందించి క్రిప్టో కరెన్సీలను స్వీకరించాల్సిందిగా పేర్కొన్నాడు. కానీ అంత త్వరగా ఈ ఆర్డర్ స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. రోజుల తరబడి వేచిచూశాడు. ఈ విషయంపై హన్యెక్జ్ ఎంతో బాధపడ్డాడు. ఆశలన్ని వదులుకున్నాడు. కానీ ఆ తర్వాత అతనికి ఓ 19 ఏళ్ల జెరెమీ స్టర్డివాంట్ నుంచి రెస్పాన్స్ వచ్చింది.
2010 మే 22న 10 వేల బిట్‌కాయిన్లకు రెండు పిజ్జాలను అందించేందుకు జెరెమీ అంగీకరించాడు. ఈ పిజ్జాలను అందుకున్న తర్వాత హన్యెక్జ్ పిజ్జాలను అందుకున్న విషయాన్ని తెలియజేస్తూ తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోను అప్పట్లో షేర్ చేశాడు కూడా. అప్పట్లో ఆ బిట్ కాయిన్ల ఖరీదు కేవలం 40 డాలర్లు మాత్రమే. అయితే హన్యెక్జ్ ఆ రోజును తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈ పిజ్జాల కోసం ఖర్చు చేసిన 10 వేల బిట్ కాయిన్ల ఖరీదు ప్రస్తుతం రూ.2,260 కోట్లు. ఇప్పుడు అతని చేతిలో ఆ బిట్ కాయిన్లు ఉండుంటే నిజంగా కోట్లాధిపతినే. కానీ ఆ రోజు పిజ్జా కోసం ఈ బిట్ కాయిన్లను అమ్మేసుకున్నాడు. బిట్ కాయిన్ ధర ఆల్ టైమ్ గరిష్టాల్లో ఉన్నప్పుడు వాటి ధర రూ.5,175 కోట్లు.