పుట్టినరోజు నాడే నూనూగు మీసాల యువకుడొకడు కడలికి బలైపోయిన హృదయ విదారక ఘటన బాపట్ల జిల్లా చీరాలలో జరిగింది. వైకుంఠపురానికి చెందిన గడ్డం దిలీప్(21) అనే యువకుడు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో క్లీనర్ గా పని చేస్తుంటాడు. మంగళవారం దిలీప్ పుట్టినరోజు కావడంతో అతడు స్నేహితులిద్దరు పార్టీ చేసుకుందామంటూ రామాపురం సముద్ర తీరానికి తీసుకెళ్లారు.
అక్కడ వారంతా మద్యం సేవించారు. అయితే మద్యం చాలకపోవడంతో వారిలో ఒకరు మళ్లీ మద్యం దుకాణానికి వెళ్లగా దిలీప్, మరో స్నేహితుడు సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల తాకిడికి దిలీప్ కొట్టుకుపోగా మరో స్నేహితుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
బుధవారం ఉదయం వాడరేవు వద్ద దిలీప్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది