అమెరికాలో గన్ సంస్కృతి మరోసారి విషం చిమ్మింది. మంగళవారం టెక్సాస్ రాష్ట్రం ఉవాల్డే కౌంటీలోని ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల సాయుధుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 21 మంది మరణించారని, మృతుల్లో 18 మంది చిన్నారులు, ముగ్గురు టీచర్లు ఉన్నట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రకటించారు. కాల్పులు జరిపిన సాల్వడార్ రామోస్(18)ను ఘటనా స్థలంలోనే పోలీసు అధికారులు కాల్చిచంపారని అబాట్ పేర్కొన్నారు. ఇద్దరు పోలీసు అధికారులకు కూడా కాల్పుల్లో గాయాలయ్యాయని, అయితే వారు ప్రాణాలతో బయటపడ్డారని గవర్నర్ చెప్పారు. చనిపోయిన వారితో పాటు గాయపడిన వారి సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు.
అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, ఇది దాదాపు దశాబ్ద కాలంలో అమెరికాలోని పాఠశాలలో జరిగిన అత్యంత ఘోరమైన కాల్పులుగా అభివర్ణించింది. ఇక ఈ విషాదకర ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. దక్షిణ కొరియా, జపాన్‌లలో తన ఐదు రోజుల పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత బుధవారం దేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని వైట్ హౌస్ తెలిపింది. విషాదాన్ని స్మరించుకుంటూ మే 28 వరకు అమెరికాలో ప్రతిరోజూ సూర్యాస్తమయం వరకు జెండాలను సగం ఎత్తులో మాత్రమే ఎగురవేయాలని బైడెన్ ఆదేశించారు.