కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా భద్రాద్రికి భక్తుల రాక తగ్గడంతో ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే కరోనా ఉదృతి తగ్గడంతో గత మూడు నెలలుగా భద్రాద్రి రామయ్యను దర్శించే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ముఖ్యంగా వారాంతంలో ఆ సంఖ్య గణణీయంగా ఉంటోంది. కరోనా అనంతరం సాధారణ రోజుల్లో ప్రతిరోజు రూ. 1. 50లక్షల నుంచి రూ. 2లక్షల ఆదాయం రాగా వారాంతంలో రూ. 3నుంచి రూ. 4లక్షల ఆదాయం వస్తోంది.
ఈ ఏడాది ఆరంభం నుంచి భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతుండటం గమనించదగ్గ విషయం. సాధారణ రోజుల్లో రూ. 3లక్షల నుంచి రూ. 4లక్షల వరకు ఆదాయం సమకూరుతుండగా వారాంతంలో రూ. 8నుంచి రూ. 10లక్షలు వస్తున్నట్లు దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. గమనించదగ్గ విషయం ఏంటంటే వారాంతంలో అధికారుల అంచనాలను మించి భక్తులు వస్తుండటంతో ఆలయంలో దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అధికారులు, సిబ్బంది దాతలు, భక్తుల పట్ల సౌమ్యంగా వ్యవహరిస్తూ వారిని ఆదరిస్తే భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేవస్థానం ఉచిత నిత్యన్నదానంలో అందరికీ అన్నదానం అందిస్తామని పేర్కొన్న దేవస్థానం అధికారులు సుదూర ప్రాంతాల నుంచి 11గంటల తరువాత వచ్చిన వారికి అన్నదానం సౌకర్యం అందించలేక పోతుండటంతో వారు ఆవేదన చెందుతున్నారు.