అంబేద్కర్ ను అవమానిస్తే జాతి క్షమించదని, రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మంటలు రాజేసి ప్రజాభిమానం పొందాలని చూడడం వృథా ప్రయాసేనని అన్నారు. కోన సీమ అలర్లపై స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతోనే కోనసీమలో చంద్రబాబు గ్యాంగ్ విధ్వంసకాండకు పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిస్థితి బాగా లేదన్న కళంకం తెచ్చేందుకే ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు.
నిప్పుతో చెలగాటం మంచిది కాదని, ఇలాంటి కుట్రలకు పాల్పడిన వారంతా చరిత్ర హీనులుగా మిగిలారని పేర్కొన్నారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం దగ్గర్నుంచి.. చంద్రబాబు చేసిన అనేక అరాచకాలను జనం మరచిపోలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. కేసుల్లో ఇరుక్కోవడం తప్ప.. రెచ్చగొట్టి సాధించేదీ ఏమీ లేదని అన్నారు.