పర్యావరణానికి హాని కలుగుతున్నందున పిల్లలను కనగూడదన్న అభిప్రాయాలను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తోసిపుచ్చారు. ‘‘కొందరు తక్కువ మంది పిల్లలను కలిగి ఉండడం పర్యావరణానికి మేలు చేస్తుందని అనుకుంటారు. కానీ, జనాభా రెట్టింపు అయినా పర్యావరణం బాగానే ఉంటుంది. పర్యావరణం గురించి నాకు చాలానే తెలుసు. జపాన్ లో అతి తక్కువ జనన రేటు ఉంది. నాగరికత కోసం పిల్లలను కలిగి ఉండడం తప్పనిసరి. మనం నాగరికతను తగ్గించకూడదు’’ అని మస్క్ పేర్కొన్నారు.
భూమిపై జనాభా భారం ఎక్కువ అయినా పర్యావరణానికి ఏమీ కాదంటున్నారు ఆయన. సంపన్నుల్లో తాను ఒక్కడిని ప్రత్యేకం అంటూ, తనకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్టు ఆయన తెలిపారు. తనకు తెలిసిన ఇతర సంపన్నులకు అసలు పిల్లలు లేకపోవడం, ఉన్నా ఒక్కరే ఉన్నట్టు చెప్పారు. అంతే కాదు, ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని కూడా ఆయన సమర్థించారు. మస్క్ కు ఏడుగురు సంతానం.
అమెరికాలో సంతానోత్పత్తి తగ్గుదలకు సంబంధించి గ్రాఫ్ ను మస్క్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అమెరికాలో జననాల రేటు కనీసం 50 ఏళ్ల పాటు మనుగడ సాగించడాని కంటే తక్కువగా ఉందన్నారు. జనాభా తగ్గుదల అంశాన్ని మస్క్ లోగడ కూడా ప్రస్తావించడం గమనార్హం.