రాజ్యసభ సభ్యుడిగా తాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హక్కుల కోసం పోరాడుతానని వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. మన దేశంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న ముఖ్యమంత్రుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారని ఆయన కొనియాడారు. వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హక్కుల కోసం తాను పోరాడుతున్నానని... ఈ వర్గాలకు తాను మరింత సేవ చేసేందుకు జగన్ అవకాశం కల్పించారని అన్నారు. దేశంలో తొమ్మిది బీసీ పార్టీలు ఉన్నప్పటికీ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టలేదని... కేవలం వైసీపీ మాత్రమే పెట్టిందని కొనియాడారు. లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి జగన్ పాటుపడుతుండటం దేశమంతా చూస్తోందని అన్నారు.