ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది జుట్టు రాలిపోవడం, జుట్టు పలచబడటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు పలచబడినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి? మళ్లీ ఒత్త్తెన జుట్టును ఎలా వచ్చేలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా గిలక్కొట్టి కుదుళ్లకు చేరేలా పట్టించాలి. 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీరు, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్త్తెన కేశాలు సొంతం చేసుకోవచ్చు. కావాలనుకుంటే తెల్లసొన గిలక్కొట్టిన తర్వాత అందులో జుట్టుకు పెట్టుకొనే నూనె, కొద్దిగా నీరు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమం కుదుళ్లకు చేరేలా మృదువుగా మర్దన చేయాలి. అప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది.
- రెండు లేదా మూడు చెంచాల మెంతులు తీసుకొని నీటిలో 10 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకొని 30 నుంచి 40 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. కావాలనుకొంటే మెంతుల మిశ్రమంలో కాస్త కొబ్బరిపాలు కూడా కలిపి జుట్టుకు రాసుకోవాలి.
- తలస్నానానికి రసాయనాలు ఉండే షాంపూలకు బదులుగా సహజసిద్ధంగా తయారుచేసిన ఉసిరి, శీకాకాయ పొడులను వాడాలి. ఇవి జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందించడంతో పాటు కుదుళ్లను దృఢంగా మార్చుతాయి. ఫలితంగా ఆరోగ్యవంతమైన జుట్టును తిరిగి పొందవచ్చు.
- ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఎదుగుదలను బాగా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఒత్త్తెన జుట్టును పొందాలనుకునే వారు ఉల్లిరసం తీసుకొని కుదుళ్ల వద్ద మృదువుగా మర్దన చేయాలి. 15 నిమిషాల పాటు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు తిరిగి పెరుగుతుంది.
- కలబంద గుజ్జును కేశాలకు, కుదుళ్లకు చేరేలా రాసుకోవాలి. తర్వాత 30 నుంచి 40 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం పొందచ్చు.
- ఆముదం, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకొని కాస్త వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు చేరేలా చేతివేళ్లతో మృదువుగా, గుండ్రంగా మర్దన చేసుకోవాలి. మొత్తం జుట్టుకు, కుదుళ్లకు నూనె సమానంగా పరుచుకునేలా జాగ్రత్తపడాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచి తీసిన టవల్ ని తలకి చుట్టుకొని గంట పాటు అలాగే ఉండాలి. తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా వస్తుంది.