కుమారుడి పబ్జీ పిచ్చి తల్లి ప్రాణాలను బలితీసుకుంది. పబ్జీ ఆడుతున్న కొడుకును భర్త కొడుతుండగా అడ్డుకోబోయిన మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఇంతియాజ్, మైమున దంపతులు చిక్కమగళూరు తాలుకాలోని హగలఖాన్ ఎస్టేట్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పబ్జీకి బానిసైపోయాడు. దీంతో పబ్జీ ఆడొద్దంటూ తండ్రి ఇంతియాజ్ తన కొడుకును మందలించాడు.
ఇదే విషయమై తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. ఇంతియాజ్ కోపంలో కుమారుడిని చంపేస్తానంటూ తుపాకీ పట్టుకున్నాడు. తన కొడుకును చంపుతాడనే భయంతో మైమున తన భర్తను అడ్డుకోబోయింది. మద్యం మత్తులో ఉన్న ఇంతియాజ్ తుపాకీతో కాల్చడం వల్ల మైమునకు బుల్లెట్ తగిలింది. వెంటనే పెద్ద కుమారుడు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.