అమాయక ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని, వారు ధరించే ఆభరణాలు కోసం మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి హతమార్చిన వ్యక్తికి గద్వాల మూడవ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు... గండీడ్ గ్రామం, బాలానగర్ మండలానికి చెందిన నిందితుడు ఎరుకలి శ్రీనివాసులు (47) గత కొన్ని సంవత్సరాలుగా మహబూబ్ నగర్ జిల్లాలోని శివశక్తినగర్ లో నివాసం ఉంటున్నాడు. 2019లో డిసెంబర్ 17న నవాబు పేట మండలం, కూచుర్ గ్రామానికి చెందిన చిట్టి అలివేలమ్మ ను మహబూబ్ నగర్ లోని టీ. డీ గుట్ట ప్రాంతానికి చెందిన కల్లు దుకాణం దగ్గరకు వెళ్లగా ఆమెకు మాయమాటలు చెప్పి దేవరకద్ర మండలం, డోకూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి కళ్ళు తాగించి, మత్తులోకి వెళ్లిన అనంతరం హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. దేవరకద్ర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితుడికి 17 హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసును విచారించిన గద్వాల్ 3వ కోర్టు న్యాయమూర్తి శివకుమార్ నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు.