ప్రాంతీయ పార్టీలలో అత్యధిక విరాళాలు స్వీకరించిన పార్టీల జాబితాను ఏడీఆర్ వెల్లడించింది. ఎక్కువ విరాళాలు స్వీకరించిన ప్రాంతీయ పార్టీలలో డీఎంకే, వైసీపీలు ఉన్నాయి. ఇదిలావుంటే దేశవ్యాప్తంంగా 31 ప్రాంతీయ పార్టీలలో 2019-20, 2020-21 డేటాను అందుబాటులో ఉంచిన 29 పార్టీల డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. 2019-20 నుంచి తమ ఆదాయం పెరిగినట్టు 10 పార్టీలు నివేదించగా.. 19 పార్టీలు క్షీణించిందని తెలిపాయి. 2019-20లో 29 పార్టీల మొత్తం ఆదాయం 2019-20లో దాదాపు రూ. 800 కోట్లుగా ఉంది.. అయితే ఆ తర్వాత సంవత్సరంలో అది దాదాపు రూ. 280 కోట్లకు పడిపోయింది.
డీఎంకే, వైసీపీ సహా ఐదు ప్రాంతీయ పార్టీలు రాజకీయ విరాళాలు ద్వారా ఐదింటి నాలుగొంతు ఆదాయం పొందాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. 2020-21 మధ్యకాలంలో ఎన్నికల కమిషన్‌కు 31 ప్రాంతీయ పార్టీలు సమర్పించిన వివరాల ప్రకారం విరాళాల ద్వారా వారికి దాదాపు రూ. 530 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా డీఎంకే రూ. 150 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. వైఎస్ఆర్-కాంగ్రెస్ (రూ. 108 కోట్లు), బీజేడీ (రూ. 73 కోట్లు), టీఆర్ఎస్ (రూ.37.65) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
2020-21లో మొత్తం 31 ప్రాంతీయ పార్టీలకు రూ.529.41 కోట్ల ఆదాయం వచ్చింది. 2019-20లో వచ్చిన రూ.800.26 కోట్లతో పోల్చితే ఇది 34.96% తక్కువ. రూ.149.95 కోట్లతో డీఎంకే తొలి స్థానంలో నిలిచింది. విరాళాలల్లో టీడీపీ 11వ స్థానానికి పరిమితమైంది. అధిక మొత్తాన్ని మిగుల్చుకున్న పార్టీల్లో వైఎస్ఆర్సీపీ (99.25%) తర్వాత బీజేడీ (90.44%), ఎంఐఎం (88.02%) ఉన్నాయి. ఈ 31 పార్టీలకు రూ.376.86 కోట్లు (71%) స్వచ్ఛంద విరాళాల రూపంలో అందాయి. వీటిలో రూ.250.60 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కూడగట్టుకున్నాయి. ఈ బాండ్ల మొత్తం కేవలం ఐదు పార్టీలకే వెళ్లింది. ఇందులో వైఎస్ఆర్సీపీ (రూ.96.25 కోట్లు), డీఎంకే (రూ.80 కోట్లు), బీజేడీ (రూ.67 కోట్లు), ఆప్ (రూ.5.95 కోట్లు), జేడీయూ (రూ.1.40 కోట్లు) దక్కాయి. 31 పార్టీలకు వడ్డీ రూపంలో రూ.84.64 కోట్ల ఆదాయం వచ్చింది.
2019-20 సంవత్సరానికి, ఏడు జాతీయ పార్టీల ఆదాయంలో 62% ఎలక్టోరల్ బాండ్ల (రూ. 2993 కోట్లు) ద్వారా లభించింది. 2020-21లో రాజకీయ పార్టీలు దాదాపు రూ. 1020 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను రీడీమ్ చేశాయి. ఐదు ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్-కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, ఆప్, జేడీ(యు) రూ. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దాదాపు రూ.250 కోట్ల విరాళాలు అందుకున్నట్లు ప్రకటించాయి.