అన్ని సక్రమంగా ఉండాలని అమెరికా తన విషయంలో మాత్రం అది పాటించడంలేదు. ఈ బాగోతం తాజా ఘటనతో వెలుగులోకి వచ్చింది. ప్రయాణంలో అవాంతరం ఏర్పడితే, ఒకటి రెండు గంటలు మహా అయితే మూడు గంటలు ఇబ్బంది కలుగుతుంది. కానీ, అమెరికన్ ఎయిర్ లైన్స్ నిర్వాకం వల్ల ఢిల్లీ చేరుకోవాల్సిన 260 మంది ప్రయాణికులు ఆదివారం నుంచి లండన్ విమానాశ్రయంలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ప్రయాణికుడు అనారోగ్యానికి గురయ్యాడన్న కారణంతో సదరు విమానాన్ని అత్యవసరంగా హీత్రూ విమానాశ్రయానికి దారి మళ్లించారు.
రెండు రోజులకు వీసాలు మంజూరు చేయించి అక్కడే హోటళ్లలో వసతి ఏర్పాటు చేశారు. కానీ, అక్కడి నుంచి వారిని ఢిల్లీకి విమానంలో పంపించాల్సి ఉండగా.. అమెరికన్ ఎయిర్ లైన్స్ ఇందులో విఫలమైంది. పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) తొలుత అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండింగ్ కు అనుమతించలేదని ఓ ప్రయాణికుడు వెల్లడించాడు. దీంతో లండన్ లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, ఫలితంగా వృద్ధులు, గర్భిణులు అవస్థ పడుతున్నట్టు మీడియాకు తెలిపాడు.
వాస్తవానికి బ్రిటన్ నుంచి భారత్ కు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికన్ ఎయిర్ లైన్స్ కు అనుమతి లేదు. డీజీసీఏ ప్రత్యేక అనుమతి ఇస్తేనే అది సాధ్యపడుతుంది. లండన్ లో నిలిచిపోయిన ప్రయాణికులను న్యూఢిల్లీ తీసుకెళ్లేందుకు వీలుగా అనుమతి కోసం చూస్తున్నట్టు అమెరికన్ ఎయిర్ లైన్స్ ప్రకటన విడుదల చేసింది. నిజానికి మంగళవారం ఉదయం 7 గంటలకు తీసుకెళతామని ఎయిర్ లైన్స్ చెప్పగా.. అది కూడా సఫలం కాలేదు. అయితే, సదరు విమానానికి డీజీసీఏ అనుమతి ఇచ్చిందని, బుధవారం వీరిని తీసుకురావచ్చని తెలుస్తోంది.