ఖరీఫ్ సాగుకు ముందస్తుగా గోదావరి నీటిని వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద డెల్టా కాల్వలకు సాగునీటిని మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విడుదల చేశారు. తద్వారా 5.29 లక్షల ఆయకట్టుకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేసి నీళ్లు ఇస్తానన్న చంద్రబాబు, దేవినేని ఉమా.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పోలవరం డయాఫ్రంవాల్ దెబ్బతింది. టీడీపీ హయాంలోకాఫర్ డ్యామ్ పూర్తిచేయకుండా డయాఫ్రం వాల్ నిర్మించారని, చంద్రబాబు తెలివితక్కువ పనివల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు. డయాఫ్రం వాల్ రిపేర్ చేయాలా? లేదంటే పునర్నిర్మించాలా? అనే విషయంపైనే ఇప్పుడు ఇరిగేషన్ నిపుణులు ఆలోచిస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాం అని మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు.