గడపగడపకు వైసీపీ పేరుతో జనంలోకి వెళ్లున్న వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలకు అక్కడక్కడా ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. పలుచోట్ల సమస్యలపై నిలదీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏళ్లుగా పరిష్కారంగాని సమస్యను స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ప్రజలపై రుసరుసలాడారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే ఆదోని మండల పరిధిలోని అలసందగుత్తిలో ఎమ్మెల్యే సాయిప్రసాద రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు తమ ప్రాంతంలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న మురుగు నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే, 30 ఏళ్ల సమస్యను ఇప్పుడు అడుగుతారా అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చి 3 ఏళ్లే అయ్యిందని, తర్వాత పరిష్కరిస్తామని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.