దేశంలోనూ కరోనా కేసుల్లో మరోసారి పెరుగుదల నమోదయ్యింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 2,745 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో ఆరుగురు కరోనాకు బలయ్యారు. గత 24 గంటల్లో కరోనాా నుంచి 2,236 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 18,386కి చేరాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఆదివారం 1.84 శాతం ఉండగా.. మంగళవారానికి 2.24 శాతానికి చేరింది. మరోవైపు, పుణే, బెంగళూరులోనూ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. మహారాష్ట్రలో తొలిసారి ఒమిక్రాన్ సబ్-వేరియంట్ కేసులు పుణేలోనే నిర్ధారణ అయ్యాయి.
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రల్లో మాత్రం పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ముంబయిలో పాజిటివిటీ రేటు భారీగా పెరగడంతో అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం ముంబయిలో పాజిటివిటీ రేటు 6 శాతానికి చేరినట్టు బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం ప్రకటించింది. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించింది. అంతేకాదు, టెస్టింగ్ ల్యాబొరేటరీలు పూర్తిస్థాయి సిబ్బందితో సంసిద్ధంగా ఉండాలని తెలిపింది.
‘‘ముంబైలో రోజువారీ కొత్త కేసులు విపరీతంగా పెరిగాయి.. వర్షాకాలం కారణంగా మేము ఇప్పుడు కోవిడ్ లక్షణాలున్న కేసులలో వేగంగా పెరుగుదలను చూస్తాం’’ అని హెచ్చరించింది. ముంబయిలో మంగళవారం 506 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫిబ్రవరి 6 (536 కేసులు) తర్వాత రోజువారీ కరోనా కేసులు 500 దాటడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే మే నెలలో రోజువారీ కోవిడ్ కేసులు 100 శాతం కంటే ఎక్కువ మేర పెరిగాయి.