బాలయ్యతో ఫోటో అంటే ఓ సాహసమే. కానీ విచిత్రంగా తనతో ఫోటో కోసం ఓ చిన్నారిని ఆయనే స్వయంగా మేలుకొల్పారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటించారు. గురువారం తన అభిమాని గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. ఎన్.బి.కె ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు, హిందూపురం గ్రామీణ మండలం కిరికెర మాజీ సర్పంచ్ రాము నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఈ ఇంటి గృహప్రవేశానికి బాలకృష్ణను ఆహ్వానించగా హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు చేరుకున్న బాలకృష్ణ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి తూముకుంట పారిశ్రామిక వాడ మీదుగా కిరికెర వచ్చారు.
కర్ణాటక-ఆంధ్ర సరిహద్దులో తూముకుంట చెక్ పోస్ట్ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు బాలకృష్ణకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కిరికెరలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాలయ్య. అనంతరం అభిమాని రాము గృహప్రవేశ వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. ఈ సమయంలో బాలకృష్ణకి రాము పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు అభిమాని రాము చేతిలో ఓ చిన్నారి ఉండగా నిద్రపోతుండటంతో బాలయ్య లేపి మరి ఫోటో దిగారు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్స్ నవ్వుకున్నారు.
ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు బాలకృష్ణ. త్వరలో తాను హిందూపురంలో బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. అనంతరం బాలకృష్ణ రోడ్డు మార్గాన బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.