విద్యార్థులు సమాజం పట్ల అవగాహన పెంచుకోవడానికి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు సమాజ సేవా ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని ముమ్మిడివరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. ప్రభాకర్ పేర్కొన్నారు. డిగ్రీ కోర్సులో భాగంగా సమాజ సేవా ప్రాజెక్టులో విద్యార్థులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటన, అక్కడ పరిస్థితులు, ప్రజల స్థితిగతులపై సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి స్థానిక కళాశాలలో ప్రిన్సిపల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటించి పూర్తి వివరాలను నివేదించాలన్నారు. నాలుగు వారాలపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామాల్లో వివరాలకోసం వచ్చే విద్యార్థులకు ప్రజలు సహకరించాలని ప్రిన్సిపల్ కోరారు.