మనం మందుబాబులను చూస్తూ ఉంటాం. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ పెగ్గువేసే కొడిపుంజును చూడటం అసాధ్యం. ఇది చూడటానికే కాదు వినడానికి కూడా వింతగా ఉంటుంది. మద్యానికి బానిసలుగా మారిన వ్యక్తులు కొందరు మందు సీసాలతోనే నిద్ర మేల్కొంటారు. ‘వాడికి మందు లేనిదే ముద్ద దిగదు’ ఇలాంటి మాటలు అప్పుడప్పుడూ వింటుంటాం. ఇది ఓ కోడి పుంజుకు ఈ మాటలు వర్తిస్తాయి. మహారాష్ట్ర భండారా జిల్లాలోని ఓ కోడి పుంజుకు మేత తినాలంటే మద్యం ఉండాల్సిందే. మద్యం లేకపోతే అసలు దాణా ముట్టుకోదు. దానికి మందు పోయించడానికి యజమాని నెలకు రూ. 2 వేల వరకూ ఖర్చుచేయడం గమనార్హం. పిప్రీకి చెందిన భావు కాతోరే అనే వ్యక్తికి కోళ్ల పెంపకం అంటే ఎంతో ఇష్టం. ఆయన వద్ద అనేక జాతులకు చెందిన కోళ్లు ఉంటాయి.
అందులోని ఓ కోడిపుంజు అంటే ఆ కుటుంబానికి ఎంతో ఇష్టం. అది వారి కుటుంబంలో ఒకటిగా కలిసిపోయింది. ఇంట్లోని వారందరూ ఎంతో ప్రేమగా దానిని చూసుకుంటారు. అయితే, గతేడాది అది అనారోగ్యానికి గురయ్యింది. దీంతో కుటుంబసభ్యులు విలవిలాడిపోయారు. దానికి దగ్గరుండి మేత, నీరు అందించారు. అయినా సరే కోలుకోకపోవడంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు. ఈ క్రమంలో నాటు సారాను పట్టిస్తే కోడి పుంజు లేచి కూర్చుంటుందని, ఆరోగ్యం కుదుటపడుతుందని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు.
అయితే, నాటుసారా లభించకపోవడంతో వైన్ షాపులో మద్యం కొని దానికి పట్టించడంతో కొద్ది రోజులకు కోలుకుంది. కానీ, ఇక్కడే ఊహించని విధంగా అది మద్యానికి అలవాటుపడింది. అప్పటి నుంచి మద్యం లేనిదే మంచినీళ్లు కూడా మట్టుకోవడం లేదు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసైన కోడి పుంజును ఆ అలవాటు మానిపించలేక భావు కాతోరే సతమతమవుతున్నాడు. మందు ముట్టనిదే ఆహారం తీసుకోవట్లేదని వాపోతున్నాడు. మద్యం కోసం ప్రతినెలా రూ.2 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని, దీనికి మాన్పించే మార్గం తెలియడం లేదన్నాడు. దానిని వెటర్నరీ డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. దీనివల్ల కోడికి ఎటువంటి ప్రమాదం లేదని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.