బెంగళూరు సిటీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయి త్వరలో అది అందుబాటులోనికి రానున్నది. సెంట్రలైజ్డ్ ఏసీతో విమానాశ్రయం మాదిరిగా ఉండే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ బెంగళూరులో అందుబాటులోకి వచ్చింది. బెంగళూరు నగరంలోనే మొదటి గ్రీన్ ఫీల్డ్ స్టేషన్‌లో సోమవారం రాత్రి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. బయప్పనహళ్లి వద్ద రూ. 314 కోట్లతో నిర్మించిన సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ను ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభించి.. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బనస్‌వాడీ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే మూడు జతల రైళ్లను సర్ విశ్వశ్వరయ్య టెర్మినల్‌కు సౌత్ వెస్ట్రన్ రైల్వే మార్చింది.
దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక టెర్మినల్ నుంచి ప్రయాణించే తొలి రైలు బనస్‌వాడీ-ఎర్నాకులం ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్. ఈ తరహా రైల్వే స్టేషన్లు దేశంలో ఇప్పటి వరకూ రెండు అందుబాటులోకి వచ్చాయి. అవి మధ్యప్రదేశ్‌లోని రాణి కమలపాటి, గుజరాత్‌లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్. అయితే, వీటిని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ కంటే ముందే ప్రారంభించినా పనులు మాత్రం పూర్తి కాలేదు. ఎస్వీ టెర్మినల్ డిసెంబర్ 2018లో పూర్తి కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల గడువు ముగిసి మార్చి 2021 నాటికి సిద్ధమయ్యింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతిలో జాప్యంతో అధికారిక ప్రారంభోత్సవం ఆలస్యమైంది.
‘‘ప్రపంచ స్థాయిలో భారతీయ రైల్వే నిర్మించి మొదటి గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్... హబీబ్‌గంజ్, గాంధీనగర్‌లను ప్రస్తుతం ఉన్న వాటిని తిరిగి ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) అభివృద్ధి చేసింది’’ అని సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పీఆర్ఓ విజయ అన్నారు. బెంగళూరులో కెఎస్ఆర్ బెంగళూరు సిటీ, యశ్వంత్‌పూర్ స్టేషన్‌ల ఉండగా ఇది మూడో రైల్వే టెర్మినల్ అవుతుంది. మైసూరు లైన్‌లో భాగమైన KSR బెంగళూరు స్టేషన్ 1882 నుంచి ఉంది. దొడ్డబల్లాపూర్ లైన్‌లోని యశ్వంత్‌పూర్ స్టేషన్ 1892లో నిర్మించారు.
సౌత్ వెస్ట్రన్ రైల్వే బెంగళూరు రైల్వే డివిజన్ 1981లో మాత్రమే ఉనికిలోకి వచ్చిందని విజయ చెప్పారు. ‘‘ఆ సమయంలో ప్రధానంగా మీటర్ గేజ్, నారో గేజ్‌గా రైల్వే ట్రాక్ ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం బెంగళూరు డివిజన్‌కు బ్రాడ్‌గేజ్ మార్గం మాత్రమే ఉంది’’ ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి, 1990ల చివరి వరకు బెంగళూరు నుంచి రైళ్లకు డిమాండ్ లేదని, చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైందని ఆమె తెలిపారు.
‘కేఎస్ఆర్ బెంగళూరు, యశ్వంత్‌పూర్ చిన్న స్టేషన్లు.. 2000లలో ఐటీ బూమ్ తర్వాత ముఖ్యంగా ఉత్తరాదికి మరిన్ని రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.. అయితే బెంగళూరులోని ట్రాక్‌లు/ స్టేషన్లు దాదాపుగా సంతృప్త స్థాయికి చేరుకున్నాయి.. దీని వల్ల అదనపు రైళ్లను నడపడానికి మరిన్ని టెర్మినల్స్ అవసరం ఏర్పడింది’’అని ఆమె చెప్పారు.
తాజాగా టెర్మినల్ ముందు భాగం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కియా) మాదిరిగా ఉంటుంది. ఇక్కడ నుంచి రోజూ 50,000 మంది ప్రయాణించవచ్చు. దాదాపు 30 జతల దూరప్రాంత రైళ్లను దశలవారీగా సర్ ఎంవీ టెర్మినల్‌కు తరలించే అవకాశం ఉందని ఎస్‌డబ్ల్యూఆర్ వర్గాలు తెలిపాయి. ‘‘రైల్వే బోర్డు ఇప్పటికే 28 జతల సుదూర రైళ్లను కొత్త టెర్మినల్‌కు మార్చడానికి ఆమోదించింది.. అయితే ఇది దశలవారీగా ఉంటుంది’’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. బనస్వాడి, కంటోన్మెంట్, కేఆర్ పురం వంటి స్టేషన్ల నుంచి కేరళ, పశ్చిమ బెంగాల్, అసో, త్రిపుర వంటి ప్రాంతాలకు రైళ్లను తొలి దశలో తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో యశ్వంత్‌పూర్, కేఎస్‌ఆర్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ల నుంచి కొన్ని రైళ్లను అక్కడికి తరలించనున్నారు.