రోజూ అవే కూరలు,అవే పచ్చళ్లు తిని తిని బోర్ కొట్టేసిందా? కొత్తగా రుచిగా ఏదైనా తినాలని నాలుక పీకేస్తుందా? అయితే పాత కాలం నాటి విలేజ్ స్టైల్ పొలం పచ్చడి ఓ సారి ట్రై చేసి తీరాల్సిందే.పూర్వకాలంలో పొలం పనులకు వెళ్లేవారు దీన్నే ఎక్కువగా చేసుకుని తినేవారు. ఇది చేయడానికి పెద్దగా కష్టపడనవరం లేదు. నూనె అక్కర్లేదు..పొయ్యితో కూడా పనిలేదు. పైగా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే మన పూర్వీకులు అంత బలంగా ఎలాంటి రోగాలు లేకుండా ఉండేటోళ్లు.ఇప్పుడంటే అంతా మిక్సీలు,గ్రౌండర్స్ వచ్చేశాయి గానీ పాత రోజుల్లో రోలు,రోకలి మాత్రమే అందిరికీ తెలిసినవి. వీటిలో కొట్టిన కారాలు అయినా,చేసే పచ్చలు లేదా రుబ్బిన పిండి అయినా టేస్ట్ వేరే లెవల్ లో ఉంటుంది. మిక్సీల్లో వేసి చేసినవి వాటి అంత టేస్ట్ రావు. రోట్లో వేసి చేసే పచ్చళ్లల్లో పొలం పచ్చడి ఒకటి. దీన్నే పచ్చిమిర్చి చింతపండు పచ్చడి అని కూడా అంటారు. చాలా తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో ఈ రుచికరమైన పచ్చడిని తయారుచేసుకోవడం ఎలానో ఇక్కడ చూడండి.
పొలం పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-చింతపండు
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-వెల్లుల్లి రెబ్బలు
-ఉప్పు
-కొత్తిమీర తరుగు
-జీలకర్ర
తయారీ విధానం
-ఫస్ట్ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేయండి.
-నిమ్మకాయంత పరిణామంలో చింతపండు తీసుకొని ఓ బౌల్ లో దానిని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
-వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసుకొని పక్కన ఉంచుకోవాలి.
-ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు రోట్లో కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా దంచాలి.
-తర్వాత ముందుగా నానెబట్టుకున్న చింతపండు గుజ్జును అందులో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు,రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను కొంచెం కొంచెం రోట్లో వేసుకుంటూ దంచుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసి కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా నూరుకోవాలి.
-తర్వాత కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకొని దాన్ని ఓ బౌల్ లోకి తీసుకోండి. పొలం పచ్చడి తినడానికి రెడీ. వేడివేడి అన్నంలో దీన్ని కలుపుకొని తింటే సూపర్ అనాల్సిందే.
-అయితే ఇంట్లో రోలు లేనివాళ్లు అయితే మిక్సీలో కూడా దీన్ని చేసుకోవచ్చు. అయితే రోట్లో చేసినదానంత టేస్ట్ దీనికి రాదు.