తమిళనాడులో విషాదం..ఒక్కర్ని కాపడబోయి మరోకరు ఇలా ఏకంగా ఐదుగురు నదిలో మునిగి చనిపోయారు. నది నీటిలో స్నానం చేసేందుకు వెళ్లిన బాలికలు ఊబిలో కూరుకుపోయి మృతి చెందారు. వారిని కాపాడేందుకు వెళ్లిన అమ్మాయిలు కూడా మరణించారు. తమిళనాడు రాష్ట్రం కడలూరులో ఈ విషాదం చోటు చేసుకుంది. గెడిలం నదిపై కడలూరు సమీపంలో ఓ చెక్ డ్యామ్ నిర్మించారు. చెక్ డ్యామ్‌కు 300 మీటర్ల కింద ఉన్న ప్రాంతంలో స్నానం చేసేందుకు నలుగురు బాలికలు దిగారు. అక్కడ స్నానం చేస్తుండగా.. ఇద్దరు బాలికలు లోతైన ప్రాంతానికి వెళ్లి బురదలో చిక్కుకున్నారు. ఊబిలో మునిగిపోతూ ఆర్తనాదాలు చేస్తుండటంతో మిగిలిన బాలికలు వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. వాళ్లు కూడా ఊబిలో చిక్కుకుపోయారు.
బాధితుల ఆర్తనాదాలు విని మరో ముగ్గురు అమ్మాయిలు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించి వాళ్లు కూడా ఊబిలో చిక్కుకుపోయారు. ఇలా మొత్తం ఏడుగురు అమ్మాయిలో ఊబిలో చిక్కుకుపోయి మృతి చెందారు. వీరందరూ 10 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారే. అక్కడికి సమీపంలో ఉన్న స్థానికులు ఓ అమ్మాయిని రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
బురదతో కూడిన ఆ ఊబి లోతు 15 మీటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జలాశయంలో నీరు తక్కువగా ఉండటం వల్ల బురదమయంగా ఉందని తెలిపారు. మృతులందరూ కడలూరు జిల్లా బన్రూటి మండలం కురుంజిపాడి, కుచ్చిపాళెయం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ప్రియదర్శిని (15), ఆమె సోదరి దివ్యదర్శిని (10), మోనిష (16), నవనీత (18), కె. ప్రియ (18), సంఘవి (16), కుముద (18) ఉన్నారు. వీరిలో ప్రియ అనే అమ్మాయి నెల కిందటే ప్రేమ వివాహం చేసుకుంది.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని ఒక్కొక్కరిని బయటకు తీశారు. మృతదేహాలను కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల రోదనలతో ఆస్పత్రి వద్ద విషాదం నెలకొంది. మంత్రి ఎమ్మార్కే పన్నీర్‌సెల్వం కడలూరు ఆస్పత్రికి వచ్చి బాధితుల కుటుంబాలను పరామర్శించారు.