ప్రపంచంలోని ఆగ్రదేశాలకు సమానంగా అన్ని రంగాలలో ఎదుగుతున్న భారత్ తాజగా అణ్వాయుధ సామర్థ్యం విషయంలోనూ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి 7.30 గంటల సమయంలో ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ క్షిపణిని పరీక్షించినట్లు పేర్కొన్నారు. సాధారణ శిక్షణలో భాగంగా సైనిక దళాల్లోని వ్యూహాత్మక కమాండ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించిందని వెల్లడించారు. క్షిపణికి సంబంధించి అన్ని అంశాలు, విశ్వసనీయతను ఈ పరీక్ష ధ్రువీకరించిందని చెప్పారు.
టన్ను పేలోడ్‌ను మోసుకెళ్లగల ఈ బాలిస్టిక్ క్షిపణి 4వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు తెలిపాయి. ‘‘విజయవంతమైన ఈ క్షిపణి పరీక్ష విశ్వసనీయమైన కనీస నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే భారతదేశ విధానాన్ని పునరుద్ఘాటిస్తుంది’’ అని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయోగం అన్ని కార్యాచరణ పారామితులు, క్షిపణి వ్యవస్థ విశ్వసనీయతను ధ్రువీకరించిందని పేర్కొంది.
అగ్ని-IV అగ్ని శ్రేణి క్షిపణులలో నాల్గోది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని అంతకుముందు అగ్ని II ప్రైమ్ అని పిలిచేవారు. గతేడాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఇది 1000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అత్యాధునిక సాంకేతికత, సామర్థ్యాలను అవలంబించడం ద్వారా భారతదేశం తన వ్యూహాత్మక క్షిపణులను మరింత బలోపేతం చేసే ప్రక్రియలో ఉంది.