ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇదిగో చెడ్డీలు తీసుకోండి...కాంగ్రెస్ కార్యాలయానికి ఆర్ఎస్ఎస్ చెడ్డీల పంపిణీ

national |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 12:07 AM

తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య చెడ్డీ వివాదం రాజుకొంది.  ఇటీవల హిజాబ్, అజాన్ వంటి వివాదాలతో సతమతమైన కర్ణాటకలో ఈ విచిత్రమైన వివాదం తెరపైకి వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య పిలుపునివ్వడంతో వివాదం రాజుకుంది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే నిక్కర్లను సేకరించిన కాంగ్రెస్‌ కార్యాలయానికి పంపుతుండటం గమనార్హం. కర్ణాటకలో విద్యావిధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. విద్యను కాషాయీకరణం చేశారని ఆరోపిస్తూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గతవారం నిరసనలు నిర్వహించారు.


ఈ సందర్భంగా కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్‌ ఇంటిని ముట్టిడించిన ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు.. బయట ఖాకీ నిక్కర్లను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్ సభ్యులు మంత్రి ఇంటిని తగలుబెట్టేందుకు ప్రయత్నించారని పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ ఆందోళనలను ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. దీనిపై సిద్ధ రామయ్య స్పందిస్తూ తాము మంత్రి ఇంటి ముందు నిరసనగా ఒక్క చెడ్డీని కాల్చితే పోలీసులు, ప్రభుత్వం విషయాన్ని పెద్దదిగా చేసి ఇంటిని తగులబెట్టడానికి ప్రయత్నించినట్టు ఆరోపిస్తున్నాయని మండిపడ్డారు.


‘ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు పోలీసుల ఎదుట ఒక చెడ్డీని కాల్చారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా మేం ఎక్కడైనా కాలుస్తాం’ అని వ్యాఖ్యానించారు. సిద్ధూ పిలుపుతో చిత్రదుర్గ, చిక్కమగళూరులోని పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం చెడ్డీలను తగులబెట్టారు. కాగా, సిద్ధూ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శలకు దారితీసింది. బీజేపీ నేత చలవాడి నారాయణస్వామి మాట్లాడుతూ.. సిద్ధరామయ్య ఈ స్థాయికి దిగజారుతారని ఊహించలేదని ధ్వజమెత్తారు.


‘సిద్ధరామయ్య చెడ్డీలు తగలబెట్టాలనుకుంటే ఆయన ఇంట్లో వాటిని కాల్చుకోనీయండి.. ఆయనకు చెడ్డీలు పంపి సహాయం చేయమని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులకు తెలియజేశాను.. చెడ్డీలను కాల్చడం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలని ఆయన్ను కోరుతున్నాను.. సిద్ధరామయ్య ఈ స్థాయికి దిగజారిపోతారని అనుకోలేదు’ అని మండిపడ్డారు.


ఇదిలావుంటే, సిద్ధరామయ్య వ్యాఖ్యలకు నిరసనగా ఆరెస్సెస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యాలయానికి పెద్ద ఎత్తున నిక్కర్‌ పార్సిళ్లను పంపుతున్నారు. అయితే, తమకు ఎటువంటి పార్సిళ్లు అందలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.


ఈ వివాదంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయకులు తమ చెడ్డీలను ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓటమితో పొగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ‘‘సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ల చెడ్డీ ఇప్పటికే లూజయ్యింది.. ప్రజలు చెడ్డీలను చింపేశారు. అందుకే వాటిని కాల్చుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో వారి చెడ్డీ పోయింది. చాముండేశ్వరిలో సిద్ధరామయ్య చెడ్డీ, లుంగీ పోగొట్టుకున్నారు. తిరిగి సంఘ్ చెడ్డీని కాల్చడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని కేంద్ర మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com