ఇదేం కాలమో గానీ మానవత్వం మంటగలిసే ఘటనలను మనం చూస్తున్నాం. మానవత్వం పరిమళిస్తున్న ఘటనలు చూస్తున్నాం. జంతువులను ప్రేమించేవారిని చూస్తున్నాం. ఇదిలావుంటే ఊర్లో పెళ్లి కుక్కల హడావుడి అనేది పాత సామెత. కానీ, ఇక్కడ మాత్రం కుక్కల పెళ్లికి జనాలతో ఊరేగింపు నిర్వహించారు. కుక్కలకు ఘనంగా పెళ్లి చేసి భారీ ఊరేగింపు నిర్వహించారు. విచిత్రమైన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ హమీర్‌పుర్ జిల్లాలోని సుమెర్‌పుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. భరువా గ్రామానికి చెందిన ఇద్దరు సాధువులు తమ పెంపుడు శునకాలకు సంప్రదాయబద్దంగా వివాహం జరిపించి, అతిథులను ఆహ్వానించారు. పసందైన వంటకాలతో విందు, భారీ ఊరేగింపును నిర్వహించడం విశేషం.
సౌంఖర్ అడవుల్లోని మానసర్ బాబా శివాలయం ప్రధాన పూజారి స్వామి ద్వారకా దాస్ మహారాజ్‌కు భూరీ అనే పేరున్న ఓ పెంపుడు శునకం ఉంది. దీనికి వివాహం చేయాలని భావించిన ద్వారకా దాస్.. పరఛాచ్‌లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్ పెంపుడు ఆడ కుక్క కల్లుతో వివాహం నిశ్చయించారు. ఇందుకు జూన్ 5న మూహుర్తంగా నిర్ణయించారు. ఈ వివాహానికి శుభలేఖలు అచ్చువేయించి తమ శిష్యులను, భక్తులను ఆహ్వానించారు. 500 మందితో భారీ ఊరేగింపు ఏర్పాటు చేశారు. తొలుత ద్వారాచర్, భన్‌వేర్, కలేవాలో పూజలు నిర్వహించి మానసర్ బాబా శివాలయం నుంచి ఊరేగింపు ప్రారంభించారు.
అక్కడ నుంచి సౌంఖర్ గ్రామ వీధులు గుండా మౌదాహా ప్రాంతంలోని పర్చా గ్రామానికి చేరుకున్నారు. శునకాలకు నూతన వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలను కూడా వేశారు. పెళ్లి అనంతరం అతిథులకు అనేక రకాల వంటకాలతో భోజనాలు వడ్డించారు. ఇరువైపుల నుంచి 500 మంది అతిథులు హాజరయ్యారు. గతవారం కల్లూకు నిర్వహించిన తిలకధారణ వేడుక సందర్భంగా వరుడు భూరీ రూ.11 వేలను కానుకగా ఇవ్వడం గమనార్హం.