ఓ పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాణాలతో బయటపడ్డారు. హార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన బస చేసిన గదిలో సీలింగ్ ఫ్యాన్ నుంచి మంటలు చెలరేగాయి. అనుచరులు అప్రమత్తమై లాలూను వెంటనే బయటకు తీసుకొచ్చారు. మంటల్ని ఆర్పివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. 13 ఏళ్ల కిందటి నాటి ఓ కేసులో విచారణ నిమిత్తం పాలము జిల్లా కేంద్రమైన మేదినీనగర్ కోర్టులో హాజరయ్యేందుకు లాలూ ప్రసాద్ యాదవ్.. అక్కడికి వచ్చారు. లాలూ తాను బస చేస్తున్న గదిలో మంగళవారం (జూన్ 7) ఉదయం అల్పాహారం తింటుండగా.. ఫ్యాన్ నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి.
లాలూ సహాయకులు, ఇతర సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పాలము జిల్లా డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఆయన వెల్లడించారు. దాణా కుంభకోణం కేసులో కొన్నేళ్లుగా జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. 13 ఏళ్ల కిందట పాలము జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారనే కేసును లాలూ ఎదుర్కొంటున్నారు. దీని విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు లాలూ సోమవారమే మేదినీనగర్ వచ్చారు.