శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండల కేంద్రం నుండి రామయ్య పాలెం మీదుగా సంతకు అలాగే అలమండ రైల్వే స్టేషన్ కు వెళ్లే రహదారి గుంతల మయమయింది. ఈ రహదారి గుండా నిత్యం అనేక వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ రహదారి మీదుగా అలమండ రైల్వే స్టేషన్ కు అలాగే మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు దగ్గర మార్గం కావడంతో ప్రయాణికులు ఈ రహదారిపై ప్రయాణిస్తుంటారు. ఈ మార్గం గోతులమయం కావడంతో ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిని నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తి కాకుండానే రోడ్డు పాడవడం ప్రయాణికులకు విస్మయం కలిగిస్తోంది. రోడ్డు నిర్మాణం లో సదరు గుత్తేదారు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ప్రయాణికులతో పాటు స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి గుండా ప్రయాణించాలంటే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత ఆర్అండ్బి అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులతో పాటు ప్రయాణికులు కోరుతున్నారు.