ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పగబట్టిన ఏనుగు...భర్త ఆత్మ గజేంద్రుడిలో దూరిందన్న కథనం

national |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 08:38 PM

 


కొన్ని ఘటనలు మనం సినిమాల్లోనే చూస్తుంటాం. అవి వాస్తవం అనిపించేలా అపుడప్పుడూ అలాంటి ఘటనలు నిత్య జీవితంలో అక్కడక్కడా జరుగుతూవుంటాయి. ఒడిశాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. ఓ వృద్ధురాలిని చంపిన ఏనుగు, ఆమె అంత్యక్రియల్లోనూ మరోసారి దాడి చేసింది. చితిపై ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని మరోసారి తొక్కి, లాగి విసిరివేసింది. దాంతో, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ వృద్ధురాలి భర్త ఆత్మ ఏనుగులో ప్రవేశించి కక్ష తీర్చుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. 


అసలేం జరిగిందంటే.... మయూర్ భంజ్ జిల్లా రాయ్ పాల్ గ్రామంలో మాయా ముర్మూ (70) అనే వృద్ధురాలు మంచి నీటి కోసం పంపు వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఓ ఏనుగు ఆమెపై దాడి చేసింది. ఆసుపత్రికి తరలించినా ఆమె ప్రాణాలు దక్కలేదు. దాంతో, అదే రోజు సాయంత్రం బంధువులు ఆమె అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. ఆమెపై దాడి చేసిన ఆ ఏనుగు అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి కూడా వచ్చింది. 


చితిపై ఉన్న వృద్ధురాలి శవాన్ని లాగేసి, మరోసారి కసిగా తొక్కింది. తొండంతో ఆ శవాన్ని విసిరిపారేసింది. అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించింది. అయితే, ఆ ఏనుగులో ఉన్నది వృద్ధురాలి భర్త ఆత్మ అని అక్కడివారు నమ్ముతున్నారు. 


ఏడేళ్ల కిందట ఆ వృద్ధురాలి భర్త మరణించాడని, ఆ వృద్ధురాలే విషం పెట్టి చంపిందని ఓ ప్రచారం ఉంది. ఆమె భర్త ఇప్పుడు ఏనుగు రూపంలో వచ్చి పగ తీర్చుకున్నాడన్న వాదన బయల్దేరింది. ఆ వృద్ధురాలు చనిపోయి చితిపై ఉన్నా సరే ఆ ఏనుగు మరోసారి దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa