కేరళలో వివిధ వ్యాధులు, వైరస్‌లు విజృంభించడం సాధారణంగా మారిపోయింది. ఇటీవలె అక్కడ టమాటో వైరస్, నోరా వైరస్‌ల కలకలం రేగింది. టమాటో వైరస్‌కు గురైన పిల్లలు జ్వరం, దద్దుర్లతో బాధపడ్డారు. అలాగే తిరువనంతపురంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేరళ వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఈ వైరస్ బారిన పడిన పిల్లలకు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా నోరో వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్యాధికారులు తెలిపారు. అంతకుముందు నిఫా వైరస్ కూడా కేరళను పట్టి పీడించింది.
కేరళలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధితో ఇంకొకరు మరణించారు. గురువారం తెల్లవారుజామున తిరువనంతపురం జిల్లాలోని వర్కాలలో అశ్వతి (15) అనే బాలిక స్క్రబ్ టైఫస్ కారణంగా చనిపోయింది. అశ్వతి పదో తరగతి పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తుంది. ఇంతలోనే స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆమెను కభలించింది. దాంతో ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆమె గ్రామాన్ని, ఆమె చేరిన ఆస్పత్రిని వెంటనే సందర్శించాలని ప్రత్యేక వైద్య బృందాన్ని ఆదేశించారు. చెరున్నియూర్ గ్రామ అధికారి ఇప్పటికే స్థలాన్ని సందర్శించి ప్రాథమిక వివరాలను సేకరించినట్టు మంత్రి ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు.
"జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం చెరున్నియూర్, పరిపల్లి మెడికల్ కాలేజీలోని ప్రాంతాలను సందర్శించనుంది." అని వీణా జార్జ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కాపలాను పటిష్టం చేస్తామని కూడా ఆమె చెప్పారు. అయితే ఈ వ్యాధితో మరణించిన అశ్వతి రెండో వ్యక్తి. అంతకంటే ముందు తిరువనంతపురం జిల్లా పరస్సాల్‌లో సబిత (39) అనే మహిళ స్క్రబ్ టైఫస్ వ్యాధితో ప్రాణాలు విడించింది. వ్యాధితో 15 రోజులుగా బాధపడి ఆమె చనిపోయింది.
ఇక స్క్రబ్ టైఫస్‌ని బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు. ఇది ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన చిగ్గర్స్ పురుగుల (లార్వా మైట్స్) కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. ఎలుకలు, ఉడతలు, కుందేళ్లు మొదలైన జంతువుల నుంచి కూడా మానవులకు ఈ వ్యాధిని వ్యాపించే అవకాశం ఉంది. ఈ వ్యాధికి గురైన వాళ్లు జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, శరీరంపై దద్దుర్లతో బాధపడుతుంటారు.