వచ్చే 2024 ఎన్నికల తర్వాత అసలు జనంలోకి రావాలంటే రాహుల్ గాంధీకి ఏకంగా పీపీఈ కిట్ అవసరమవుతుందేమోనంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను చూసినంతనే నెటిజన్లు సాయిరెడ్డిపై ట్రోలింగ్ మొదలెట్టారు. ఏ అర్హత ఉందని రాహుల్ గాంధీని ఇలా విమర్శిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే... ఏపీ సీఎం జగన్ పరదాల మాటున పర్యటనలు సాగిస్తున్నారు కదా అంటూ మరో నెటిజన్ దెప్పి పొడిచారు. 'ఎందుకైనా మంచిది, మీరు ఓ డజన్ పీపీఈ కిట్లు దగ్గర పెట్టుకోండి' అంటూ ఆ నెటిజన్ సాయిరెడ్డిపై పంచ్ సంధించారు. రాహుల్ గాంధీని తక్కువగా అంచనా వేస్తున్నారన్న మరో నెటిజన్ సాయిరెడ్డికి త్వరలోనే తన తప్పేంటో తెలుస్తుందంటూ పేర్కొన్నారు.
ఇదిలావుంటే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు సోమవారం హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన సోదరి ప్రియాంకా గాంధీ తోడు రాగా ఈడీ ఆఫీస్‌కు బయలుదేరిన రాహుల్ గాంధీ ఫొటోను జత చేస్తూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
కర్మ ఫలం ఎక్కడికి పోతుంది అన్నట్లుగా అర్థం వచ్చేలా సాగిన ఆ పోస్టులో... ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జనానికి రాహుల్ గాంధీ ముఖం చూపించలేకపోతున్నారని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా 2024 ఎన్నికల తర్వాత అసలు జనంలోకి రావాలంటే రాహుల్ గాంధీకి ఏకంగా పీపీఈ కిట్ అవసరమవుతుందేమోనంటూ మరో కామెంట్ చేశారు.