ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం తీసుకొస్తున్న అగ్నిపథ్ పథకానికి నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మక రూపం సంతరించుకుంటున్నాయి. నిన్న బీహార్లోని పలు రైల్వేస్టేషన్లలో ఆస్తుల ధ్వంసం చేసిన ఆందోళనకారులు ఇవాళ నేతల్ని టార్గెట్ చేశారు. ఏకంగా బీహార్ డిప్యూటీ సీఎం రేణూ దేవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ ఇళ్లపై దాడులకు దిగారు. బెటియాలోి వీరిద్దరి ఇళ్లపై ఇవాళ ఆందోళనకారులు తీవ్రంగా దాడులు చేశారు. దీంతో నేతలు అచేతనంగా మారిపోయారు. ఆందోళనకారుల్ని కట్టడి చేసే విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారు రెచ్చిపోతున్నారు. బీహార్లో ఇవాళ రెండో రోజూ పలు చోట్ల ఆందోళనలు చేపట్టిన నిరసనకారులు నేతల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్దితుల్ని అదుపు చేస్తున్నారు.
ఇదిలావుంటే ఇప్పటికే ఆందోళనలు మొదలైన బీహార్ లో పరిస్దితులు అదుపు తప్పేలా ఉన్నాయి. రోడ్లపైకి భారీ ఎత్తున తరలివస్తున్న ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టడంతో పాటు భారీగా ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నాయి. కేంద్రం ప్రకటించిన అగ్ని పథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దాడుల్లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరుగుతున్నా వెంటనే చర్యలు తీసుకునే పరిస్దితులు కనిపించడం లేదు. దీంతో బీహార్లో అదికారంలో ఉన్న జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. గతంలో వ్యవసాయ చట్టాలతో పాటు పలు అంశాలపై ఆందోళనలు జరిగినా ఈ స్ధాయిలో దాడులు జరగలేదు. కానీ ఇప్పుడు మారిన పరిస్ధితులతో కేంద్రం పునరాలోచనలో పడాల్సిన పరిస్దితి కనిపిస్తోంది