ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో అవకాశం ఇచ్చింది. ఈ పథకం కోసం ఈ కేవైసీ పూర్తి చేయడానికి మే 31 గడువు ముగిసిన విషయం తెలిసిందే. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ గడువును జూలై 31 వరకు పొడిగించింది. ఈ కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్ అందుబాటులో ఉందని రైతులు దగ్గర్ లొ ఉన్న సిఎస్ ఈ సెంటర్లలో బయో మెట్రిక్ ఆధారిత ఈ కేవైసీ చేయించుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం నుంచి అన్ని మండల వ్యవసాయ అధికారులకు కార్యాలయాలకు ఆదేశాలందాయి.
దీంతో జిల్లాలో 32 శాతం మేర ఈ కేవైసీ నమోదు చేయించుకోని రైతులకు ఇది మంచి అవకాశం అయినందున ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించి జూలై 31 గడువులోగా ఈ కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు.
అనర్హులను జల్లెడ పట్టేందుకే రైతులకు ఏడాదికి మూడు పర్యాయాలు రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు వ్యవసాయ పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అందిస్తోంది. ఇప్పటివరకూ పది విడతలు ఎలాంటి షరతులు లేకుండా సాయం చేసింది. తప్పుడు ఖాతాలతో నగదు పొందకుండా ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో పాటు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. ఈ విషయమై రైతులకు అవగాహన లేక నష్టపోతున్నారు. ఈ కేవైసీ నమోదు లేకుంటే చాలా మంది రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. ఈ కేవైసీ చేయించుకుంటేనే పి ఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.