అనుమర్లపూడి దద్దరిల్లింది. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ తో అక్కడి పరిస్థితి వేడెక్కింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. మట్టిమాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు తలపెట్టిన చలో అనుమర్లపూడిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆంక్షలు దాటుకుని అనుమర్లపూడి చెరువు వద్దకు చేరుకున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ సహా ఎవరి అనుమతులతో చెరువును తవ్వుతున్నారని.. వైఎస్సార్సీపీ అరాచకాలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డారు. అరెస్ట్ అనంతరం ధూళిపాళ్ళను చింతలపూడిలోని తన స్వగృహం వద్ద దింపి అక్కడే పోలీసులు నిఘా పెట్టారు. నరేంద్ర ఇంటికి పార్టీ నేతలు భారీగా తరలి వెళ్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట జరిగింది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు అనుమర్లపూడి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీలు హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులో చలో అనుమర్లపూడికి వెళ్లేందుకు సిద్దమైన టీడీపీ నేతలు.. మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, డేగల ప్రభాకర్‌ను పోలీసులు గృహనిర్భందం చేశారు. చలో అనమర్లపూడి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అప్రమత్తం అయ్యారు. అనమర్లపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. అనమర్లపూడి వెళ్లే రోడ్లలో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.