ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూల్చివేతను వెంటనే ఆపండి...హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 03:27 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి ఊరాట లభించింది. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చడం వెంటనే ఆపేయాలని మధ్యంతర  ఉత్తర్వులు  జారీచేసింది. ఇదిలావుంటే అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. తమ ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతను నిలిపివేయాలంటూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్‌, రాజేష్‌ ఆదివారం హైకోర్టులో హౌస్ మోహసన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమోదం పొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేశారన్నారు పిటిషనర్ల తరఫు లాయర్. తహసీల్దార్‌, జలవనరులశాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే నిర్మించారని.. రాజకీయ కక్షతో, నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారన్నారు.


ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జడ్జి.. అర్ధరాత్రి కూల్చివేతలేంటని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇప్పటికే కొంతభాగం కూల్చివేత జరిగిందని రెవెన్యూశాఖ తరఫున ప్రభుత్వ లాయర్ చెప్పారు. అలాగే పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలుండగా ఇదేం పద్ధతి అని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కూల్చివేత ప్రక్రియలో ముందుకెళ్లొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని అధికారులకు తక్షణం తెలియజేయాలని ప్రభుత్వ లాయర్‌కు సూచించింది. విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు.. కూల్చివేత ప్రక్రియలో ముందుకెళ్లొద్దని అధికారులను ఆదేశించారు.


మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం ఇంటి ప్రహరీ గోడను ఆదివారం తెల్లవారుజామున కూల్చేందుకు అధికారులు వచ్చారు. నర్సీపట్నం మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు రెండు పొక్లెయిన్‌లతో అక్కడికి చేరుకున్నారు. ఇంటి వెనుక ప్రహరీని కూల్చివేయడం ప్రారంభించారు.. అయ్యన్న భార్య పద్మావతి వచ్చి కూల్చివేత ఆపాలని కోరినా అధికారులు వినలేదు. వెంటనే ఆయన కుమారుడు, టీడీపీ కేడర్ అక్కడికి వచ్చారు. దీంతో కూల్చివేత ప్రక్రియ తాత్కాలికంగా నిలిచింది. 2 సెంట్లను చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు రాజేష్‌ ఆక్రమించినట్లు స్థానిక తహసీల్దారు జయ నోటీసిచ్చారు. 300 మంది పోలీసులను మోహరించడం, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని.. ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని అధికారుల్ని అయ్యన్న కుటుంబం ప్రశ్నించింది. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఆక్రమణ అంటూ మార్కింగ్‌ వేయడం దారుణమన్నారు. తర్వాత కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఊరట లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com