టీడీపీ చేపట్టిన చలో నర్సీపట్నం కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారంతో హీట్ కొనసాగుతోంది. టీడీపీ చలో నర్సీపట్నం పిలుపునివ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బీసీలపై దాడులు, హత్యలను నిరసిస్తూ టీడీపీ ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో ముందుగానే పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని గృహనిర్బంధం చేశారు. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్దా నాగజగదీశ్వరరావుతో పాటు మరికొందరు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. నర్సీపట్నంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రి మృణాళిని ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు చుట్టుపక్కల జిల్లాల నుంచి నర్సీపట్నం బయల్దేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్లకుండా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను, వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని హౌస్ అరెస్ట్ చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు.. పాడేరులో మాజీ మంత్రి కిడారి శ్రావణ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలను పోలీసులు నిర్బంధించారు. ఇటు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అయ్యన్న కుమారుడు చింతకాయల విజయ్ నర్సీపట్నంలో దీక్షకు దిగారు. అయ్యన్న ఇంటివద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన దీక్షకు కూర్చొన్నారు. నల్లకండువా వేసుకుని విజయ్ నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, పీలా గోవింద్ వెంకట సత్యనారాయణ, కేఎస్‌న్‌రాజులు విజయ్ దీక్షకు మద్దతు తెలిపారు. అయ్యన్నపాత్రుడి ఇంటి దగ్గర గోడ కూల్చిన ప్రదేశాన్ని పలువురు టీడీపీ, సీపీఐ నేతలు పరిశీలించారు. విశాఖ నుంచి వచ్చిన తెలుగు మహిళలు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆయన సతీమణి పద్మావతిని పరామర్శించారు. తదితరులు వచ్చారు. ‘చలో నర్సీపట్నం’ నేపథ్యంలో పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.