పుట్టిన రోజు ఎక్కడైన తమ ఇండ్లలో లేదా మరే చోటైనా చేసుకొంటారు. కానీ అదే పోలీస్ స్టేషన్ లో చేసుకొంటే..అలా వేడుకలు చేసుకొంది ఓ రౌడీ షీటర్ అయితే ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దాని మూల్యం ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ సిబ్డంది చెల్లించుకొన్నారు. ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీషీటర్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో సిబ్బందిపై వేటు పడింది. ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రతి నెలా రౌడీషీటర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తుంటారు. ఇదే క్రమంలో ఈ నెల 18 సాయంత్రం కూడా రౌడీ షీటర్లు స్టేషన్‌కు వచ్చారు. వారిలో వైసీపీ కార్పొరేటర్ భర్త భీమవరపు హేమసుందర్ కూడా ఉన్నారు. పోలీసులు ఎవరి హడావుడిలో వారు ఉండగా కొందరు రౌడీలు స్టేషన్ ప్రాంగణంలోనే హేమసుందర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై డీఐజీ పాలరాజు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆదివారం ఎస్సై కిషోర్‌బాబు, కానిస్టేబుల్ రాజేష్‌ను సస్పెండ్ చేయడంతో పాటు సీఐ రమణకు ఛార్జి మెమో జారీ చేశారు. సంఘటనపై విచారణ చేపట్టారు. ఆ రౌడీషీటర్ అధికార పార్టీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్ భర్త కావడం గమనార్హం.