అప్పుచెల్లించాలంటూ టీడీపీ ఎంపీ కేశినేని నానికిి డీఆర్‌టీ నోటీసులు జారీ చేసింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఎదురు దెబ్బ తగిలింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఎంపీ నానికి డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) సమన్లు జారీ చేసింది. తమ బ్యాంకు నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో కేశినేని సంస్థల నుంచి వడ్డీతో సహా డబ్బులు వసూలు చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ డీఆర్‌టీని ఆశ్రయించింది. జూలై 11వ ఉదయం 10.30లోగా నేరుగా, లేని పక్షంలో లాయర్ల ద్వారా వివరణ ఇవ్వాలని.. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఆర్‌టీ తేల్చి చెప్పింది. కేశినేని నానితో పాటు కేశినేని పావని, కేశినేని కార్గో అండ్ కారియర్స్ లిమిటెడ్‌లకు కూడా పత్రికా ప్రకటన ద్వారా డీఆర్‌టీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఎంపీ నాని కేశినేని ట్రావెల్స్ నడిపారు. దీనికి సంబంధించి బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రుణాలను చెల్లించకపోవడంతోనే డీఆర్‌టీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. మరి ఎంపీ ఎలా స్పందిస్తారన్నది చూడాలి. అంతేకాదు కేశినేని 2019 ఎన్నికలకు ముందు తన కేశినేని ట్రావెల్స్‌ను మూసివేసిన సంగతి తెలిసిందే.