శవ అంత:క్రియలు శ్మశాన వాటికల్లో జరగాలి. అంతేకానీ ఇండ్ల మధ్య అంటే ఆందోళన చెందాల్సిన అంశమే. ఇలాంటి సమస్యే బంగారమ్మ కాలనీ వాసులకు వచ్చి పడింది. తిరుపతిలో కరకంబాడి రోడ్డులోని తిమ్మినాయుడుపాలెం హరిజన వాడవారికి పెద్ద కష్టమే వచ్చి పడింది. శ్మశాన స్థలం లేకపోవడంతో ఇళ్ల మధ్యనే మృతదేహాలను ఖననం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తిమ్మినాయుడుపాలెం హరిజనవాడ బంగారమ్మ కాలనీలోని 61 కుటుంబాలకు 1984లో అప్పటి ప్రభుత్వం పక్కా ఇళ్లు కేటాయిస్తూ స్థలాలు మంజూరు చేసింది. అయితే, ఈ కుటుంబాల సంఖ్య పెరగడంతో హరిజనవాడతోపాటు దక్షిణం వైపు సర్వేనెంబర్ 199లోని ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి 2011లో అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఈ ప్రాంతం బంగారమ్మ కాలనీగా ఏర్పడింది.
ఇక్కడ ఎవరైనా చనిపోతే సమీపంలోని ఓ ప్రైవేటు స్థలంలో ఖననం చేసేవారు. తరవాత కాలంలో ఆ ప్రైవేటు స్థలాన్ని ప్లాట్లు వేసి విక్రయించారు. అప్పటినుంచి శ్మశాన స్థలం కోసం ఇక్కడి ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు. పలుసార్లు ఉన్నతాధికారులు హరిజనవాడను పరిశీలించినప్పుడు.. కాలనీ వెనుకవైపు ఉన్న రెండెకరాల ఫారెస్టు స్థలం అనుకూలంగా ఉంటుందని కాలనీవాసులు సూచించారు. 2013లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సైతం శ్మశానానికి స్థలం కేటాయించాలని కలెక్టరును కోరారు. అయినా కార్యరూపం దాల్చలేదు.
అయితే, తాజాగా బంగారమ్మ కాలనీ వాసులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. పక్కకాలనీ వాసులు తమ ఇళ్లలో ఎవరైనా చనిపోతే తీసుకొచ్చి బంగారమ్మ కాలనీలో ఖననం, దహనం చేస్తున్నారట. దీనిపై ప్రతిసారీ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. అయినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని తమకు శ్మశానం ఏర్పాటుచేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.