అగ్నిపథ్ ఒక వినూత్నమైన సంస్కరణ అని బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ప్రశంసించారు. అగ్నివీరులకు సైన్యంలో పనిచేసిన నాలుగేళ్ల తర్వాత ఎన్నో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నాలుగేళ్ల తర్వాతి భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
భారత త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై ఓ వైపు నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కార్పొరేట్ రంగం ఈ పథకాన్ని స్వాగతిస్తోంది. ఈ క్రమంలో ఈ పథకంపై బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ, అగ్నిపథ్ ఒక వినూత్నమైన సంస్కరణ అని ప్రశంసించారు. అగ్నివీరులకు సైన్యంలో పనిచేసిన నాలుగేళ్ల తర్వాత ఎన్నో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నాలుగేళ్ల తర్వాతి భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తమ సంస్థలో 60 నుంచి 100 మంది వరకు ఎక్స్ సర్వీస్ వ్యక్తులు పని చేస్తున్నారని, వీరు కేవలం సెక్యూరిటీ విధులకే పరిమితం కాకుండా పలు ఇతర సెక్షన్లలో కూడా పని చేస్తున్నారని తెలిపారు. అడ్మినిస్ట్రేషన్, ఇంజినీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ విధుల్లో కూడా ఉన్నారని చెప్పారు. ఎక్స్ సర్వీస్ మెన్ల సేవలను వినియోగించుకునేందుకు కార్పొరేట్ సెక్టార్ లో ఎన్నో విభాగాలు ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ లో ఆర్మీ అనుభవం ఎంతో లాభిస్తుందని ఆమె చెప్పారు. ఆర్మీ శిక్షణ పొందిన వారి అవసరం కార్పొరేట్ సెక్టార్ కు ఎంతో ఉందని కిరణ్ మజుందార్ షా తెలిపారు. సైన్యంలో పని చేసిన వారికి అద్భుతమైన నైపుణ్యం ఉంటుందని... ఇలాంటివారు కార్పొరేట్ రంగానికి అవసరమని చెప్పారు.