మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో ఆ రాష్ట్ర సీఎం, గవర్నర్ ఇరువురికి కరోనా వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకొంటాయోనన్నది చర్చాంశనీయంగా మారింది. కరోనా కూడా ఎంట్రీ ఇచ్చింది. శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు కేబినెట్ మీటింగ్ నిర్వహించాల్సి ఉండగా.. అంతకు ముందు థాక్రేకు కోవిడ్ సోకినట్లు తేలింది. దీంతో కేబినెట్ భేటీకి ముందు ఆయన్ను కలవాలని కమల్ నాథ్ భావించినప్పటికీ కుదరలేదు. ఉద్దవ్ కోవిడ్ బారిన పడటంతో వర్చువల్‌గా కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి 8 మంది మంత్రులు డుమ్మా కొట్టారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీకి సైతం కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయన్ను దక్షిణ ముంబైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను కలవాలని భావించే వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కావొచ్చని మహా గవర్నర్ తెలిపారు.
గతంలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 106 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ ఎన్నికల అనంతరం సీఎం కుర్చీని 55 సీట్లు మాత్రమే సాధించిన శివసేనతో పంచుకోవడానికి బీజేపీ ఇష్టపడలేదు. దీంతో కూటమి నుంచి బయటకొచ్చిన శివసేన.. 53 సీట్లున్న ఎన్సీపీ, 44 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్ అఘాడీ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్దవ్ థాక్రే సీఎం పగ్గాలు చేపట్టారు.
శివసేన నేత, ప్రభుత్వ చీఫ్ విప్ ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌లో మకాం వేశారు. పార్టీ నాయకుల సాయంతో ఉద్దవ్ థాక్రే ఆయనతో ఫోన్లో మాట్లాడగా.. ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి నుంచి శివసేన బయటకు వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన ఉద్దవ్.. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనంతరం షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గువహటికి మకాం మార్చారు. 40 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని షిండే ప్రకటించారు.
బీజేపీతో కూటమిగా ఏర్పడాలని షిండే డిమాండ్ చేసినప్పటికీ.. థాక్రే అందుకు సుముఖంగా లేరు. అవసరమైతే అసెంబ్లీని రద్దు చేస్తామని శివసేన నాయకత్వం సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడు రాజ్ థాక్రే తన ట్విట్టర్ బయోలో పర్యాటక మంత్రి అనే పదాన్ని తొలగించారు. మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తే.. రాష్ట్రపతి పాలన విధించి.. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మహారాష్ట్ర శాసనసభకు సైతం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.