రాష్ట్రపతి ఎన్నికల్లోనే కాదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం దిశగా పయనించాలన్న లెక్కల్లో భాగంగానే రాష్ట్రపతి అభ్యర్తిగా ద్రౌపది ముర్మును బీజేపీ ఎంపీక చేసినట్లు సమాచారం. పక్కా లెక్కలతోనే ఈ ఎంపిక సాగినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్మును ఎంపిక చేశారు. దీంతో తొలిసారి గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు అవకాశం లభించింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మంగళవారం రాత్రి జరిగిన బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సుమారు 20 పేర్లను పరిశీలించారు. చివరకు ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఇప్పటివరకూ ఎస్టీలు తప్పా అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్రపతి పదవి చేపట్టే అవకాశం దక్కడంతో ఈసారి వర్గానికి గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో వ్యూహాత్మంగా బీజేపీ ఎంపిక చేసింది.
ఇక, ముర్మూ ఎంపికలో బీజేపీ వ్యూహాత్మకంగానే ముందుకెళ్లింది. ఇప్పటివరకు రైసినా హిల్ మెట్లు ఎక్కని ఎస్టీ సామాజిక వర్గానికి దేశ అత్యున్నత పదవిని అప్పగించిన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకోవడానికే ద్రౌపదీ ముర్మూని బీజేపీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ఏడాది చివరిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, తెలంగాణ, కర్ణాటక, త్రిపుర ఎన్నికలు జరగనుండగా.. ఈ రాష్ట్రాల్లో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోడానికే ముర్మూను తెరపైకి తీసుకొచ్చారనే భావన వినిపిస్తోంది. ఎలక్టొరల్ కాలేజిలో ఎన్డీయేకి 58 % ఓట్లు ఉండటంతో ముర్మూ గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పక్షం భావిస్తోంది. సోమవారమే 64వ పుట్టినరోజు చేసుకున్న ముర్మూ.. ఒకవేళ ఎన్నికైతే రాష్ట్రపతులందరిలో పిన్న వయస్కురాలిగా నిలుస్తారు.
తమ రాష్రానికే చెందిన ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆమెకు మద్దతు ప్రకటించారు. ఈ పేరును ప్రకటించే ముందు నవీన్ పట్నాయక్‌తోనూ బీజేపీ సంప్రదించింది.
వాస్తవానికి 2017 రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ద్రౌపది ముర్ము పేరు పరిశీలనకు వచ్చింది. కానీ, కొన్ని సమీకరణాలతో దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను చివరకు ఖరారు చేశారు. ఇక, భారత్‌కు తొలి మహిళా రాష్ట్రపతిగా 2007 నుంచి 2012 వరకు ప్రతిభాదేవి సింగ్ పాటిల్ ఉన్నారు. ఆమె తర్వాత అధికార పార్టీ నుంచి రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ ముర్మూ.
64 ఏళ్ల ముర్మూ 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించారు. ఒకవేళ, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వాతంత్రం తర్వాత భారత్‌లో పుట్టి, ఆ స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ రికార్డు సాధిస్తారు. ఇప్పటివరకూ రాష్ట్రపతులుగా ఉన్నవారంతా బ్రిటిష్ ఇండియాలో జన్మించినవారే. సంతాల్ గిరిజన అదివాసీ తెగకు చెందిన ముర్మూ.. ఒడిశా బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోని నవీన్ పట్నాయక్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.