కాలనుగుణంగా మన దేశ యువత ఆలోచన తీరు మారుతోంది. ఎంత పనికి అంత ప్రతిఫలం అన్నదిశగా వారి ఆలోచనలు సాగుతున్నాయి. దీంతో ఎదుగుబొదుగులేని ఉద్యోగాలు మాకేలా అన్నట్లు యువత అనాసక్తితో ఉందని ఓ సర్వే తేల్చింది. ప్రస్తుతం భారత కార్పొరేట్ కంపెనీలలో గ్రేట్ రిజిస్ట్రేషన్ ట్రెండ్ నడుస్తోంది. ఇంక్రిమెంట్లు ఇచ్చిన తర్వాత ఉద్యోగులు కంపెనీలకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం 40 శాతం మంది వైట్ కాలర్, యూత్ ఎంప్లాయీస్ తాము పనిచేసే కంపెనీలకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు తాజా సర్వే రిపోర్టు వెల్లడించింది. అంటే ప్రతి పది మంది ఉద్యోగులలో నలుగురు రిజైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్ సంస్థ నమన్ హెచ్‌ఆర్ ఈ సర్వేను చేపట్టింది. ఐటీ, ఐటీఈఎస్, సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాలు ఎక్కువగా అట్రిక్షన్ రేటు ఎదుర్కొంటున్నాయని ఈ సర్వే వెల్లడించింది. 2021 నుంచి భారత కార్పొరేట్ కంపెనీలలో గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ నడుస్తోంది.
తక్కువ వేతన పెంపు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, ఎదిగేందుకు అవకాశాలు తక్కువగా ఉండటం, గుర్తింపు లేకపోవడం వంటి పలు కారణాల చేత ఉద్యోగులు కంపెనీలను వీడుతున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఇవన్ని ఉద్యోగంపై అసంతృప్తి కలుగజేస్తున్నాయని చెప్పింది. ఉద్యోగానికి రాజీనామాలు చేస్తోన్న వారు.. ఎంట్రప్రెన్యూర్‌షిప్ కోసం సరికొత్త అవకాశాలను వెతుకుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే భారత కార్పొరేట్ కంపెనీలలో నెలకొన్న అట్రిక్షన్ సమస్యలు వైదొలగవని ఈ సర్వే తెలిపింది.
కంపెనీలలో ఉద్యోగానికి రాజీనామా చేస్తోన్న ప్రతి పది మంది ఉద్యోగులలో ఒకరు ఎంట్రప్రెన్యూర్ కావాలని కోరుకుంటున్నట్టు ఈ సర్వే తెలిపింది. మొత్తం కార్పొరేట్ వాతావరణం ప్రస్తుతం వ్యవస్థాపకత స్ఫూర్తిని ప్రదర్శిస్తుందని నమన్ హెచ్‌ఆర్ ఫౌండర్ సమీర్ పారిఖ్ తెలిపారు. అయితే కేవలం ఐటీ రంగం మాత్రమే కాక, సర్వీస్ సెక్టార్ కూడా అట్రిక్షన్ వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నట్టు పారిఖ్ చెప్పారు. అంతేకాక మాన్యుఫాక్చరింగ్ కంపెనీలను వీడుతోన్న ఉద్యోగులు, కేవలం తయారీ కంపెనీలలో మాత్రమే కాక, టెక్, సర్వీస్ వంటి ఇతర రంగాల కంపెనీలలో కూడా చేరుతున్నట్టు తెలిపారు.