ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ .. భారత్‌ను వీడటానికి సంబంధించి కీలక విషయాలు బయటపెట్టారు. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందన్నాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ ఈ విషయాలు వెల్లడించాడు.‘‘దావూద్ నుంచి ప్రాణహాని కారణంగానే దేశాన్ని వీడాను. మొదట్లో, దేశం విడిచి వెళ్లేందుకు చట్టపరమైన అంశాలేవీ లేవు. దావూద్ నుంచి బెదిరింపులు రావడంతోనే దేశాన్ని వీడా. ఆయన మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్నాడు. అందులో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు ప్రాణహాని కల్పించేందుకు దావూద్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎలాంటి అవినీతి లేకుండా నిబద్ధతతో కూడిన ఆటే నాకు ముఖ్యం’’ అని లలిత్ మోదీ పేర్కొన్నారు.ఇక భారత్‌కు తిరిగి రావడంపై లలిత్ మోదీ స్పందిస్తూ.. ఎప్పుడైనా వచ్చే అవకాశాలున్నాయని చెప్పాడు. చట్టపరంగా తాను పారిపోయిన వ్యక్తిని కాదని, తనపై ఒక్క కేసు కూడా లేదన్నాడు. ఇదిలాఉంటే, 2010లో భారత్‌ను వీడిన లలిత్ మోదీ.. ప్రస్తుతం లండన్‌లో నివాసముంటున్న విషయం తెలిసిందే.