1998 డీఎస్సీ లో క్వాలిఫై అయిన వారికి పోస్టింగ్స్ కి సహకరించిన సీఎం జగన్ కి కృతజ్ఞతగా ఉండటం అంటే చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడమేనని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెద్దపాడు కార్యాలయంలో డీఎస్సీ 1998 అభ్యర్థులు మంత్రి ధర్మానను కలుసుకుని సీఎంకు, ఇతర ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కష్టం గుర్తించి, తమ సమస్యను మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న సీఎం జగన్ వెంటే తామంతా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ.. ఆర్థిక ఉన్న కష్టాలను పట్టించుకోకుండా, ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు సీఎం వీరి విషయమై సానుకూల నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ సమాజాన్ని మార్చాలి అన్నా, ఈ సమాజంలో శతాబ్దాలుగా నష్టపోతూ ఉన్న వర్గాలు, ముఖ్యంగా నిరాశ, నిస్పృహల్లో ఉన్న వర్గాలు వారి జీవితాల్లో ఆశలు చిగురించేలా చేయాలని, స్వాతంత్ర్యం అనంతరం మా జీవితాలు బాగు పడ్డాయి అన్న ఆలోచన వచ్చే విధంగా పాలన సాగించాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారని, ఆ దిశగా ప్రయాణిస్తున్న ప్రభుత్వానికి ఎవరు స్థాయిలో వారు ఆయనకు మద్దతుగా నిలవాలి అని అన్నారు. ముఖ్యమంత్రి భావజాలాన్ని అర్థం చేసుకుని, తదనుగుణంగా ఆయనకు అండగా ఉండి, ఎవరి స్థాయిలో వారు సమున్నత రీతిలో పనిచేసి, దైవం ఆశీస్సులు కూడా అందుకుని మరింత మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానని అన్నారు. తొలుత మంత్రి ధర్మానకు 1998 డీఎస్సీలో ఉద్యోగార్హత సాధించిన వారు ఆత్మీయ సత్కారం అందించారు. కార్యక్రమంలో కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు తదితరులు ఉన్నారు.