శ్రీలంక దేశం లో సామాన్యుడి జీవితం కకావికలమైంది. ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ దిగుమతులు తగ్గిపోయి.. తీవ్ర కొరత నెలకొంది. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక విదేశాల నుంచి చేసుకునే దిగుమతులకు డబ్బులు చెల్లించలేకపోతోంది. భారత్ సహా వివిధ దేశాలు అందిస్తున్న రుణాలు, ఆర్థిక సాయంతో గడుపుతోంది. కొద్దికొద్దిగా చమురు దిగుమతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజా దిగుమతులు ఆలస్యం అవుతుండటంతో ధరలు పెంచాల్సి వచ్చిందని శ్రీలంక చమురు మంత్రిత్వ శాఖ మంత్రి కాంచన విజేశేఖర తెలిపారు. ధరలు పెంచడం, కొరతపై ప్రజలకు క్షమాపణ చెప్పారు. వాహనదారులెవరూ బంకుల ముందు క్యూలు కట్ట వద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం పెట్రోలియం సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆదివారం పెట్రోల్, డీజిల్ ల ధరలను ఏకంగా 22 శాతం పెంచేసింది. దీనితో అక్కడి కరెన్సీ ప్రకారం.. లీటర్ పెట్రోల్ ధర రూ.550కు, డీజిల్ ధర రూ.460కి చేరాయి. అసలే ఆర్థిక సమస్యలతో కకావికలం అవుతున్న పేదలు, మధ్య తరగతి వారిపై ఇది మరింత భారం మోపుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో.. చాలా మంది ప్రజలు బంకుల ముందు క్యూలలో వాహనాలు పెట్టేసి వెళ్లిపోతున్నారు. ఎప్పుడైనా పెట్రోల్, డీజిల్ రాగానే వాహనాల్లో పోయించుకోవచ్చని అలా చేస్తుండటం గమనార్హం.