మంత్రి వర్గ విస్తరణ, ఇతర కారణాల వల్ల వైసీపీలోనూ క్రమంగా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ ధిక్కార స్వరాలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి ప్రమాదం కాకూడదని భావిస్తున్న అధికార వైసీపీ అధినాయకత్వం వాటిపై గట్టి నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ధిక్కార స్వరాలు ఏం చేస్తున్నాయి. ఎవరితోనైనా టచ్ లో ఉన్నారా...? అన్న దానితోపాటు వారి ప్రతి కదలికపై నజర్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలపై దృష్టిసారించారని ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో వాళ్లేం చేస్తున్నారు? వారి అనుచరులు ఏం చేస్తున్నారు? మౌలిక సౌకర్యాల పరిస్థితి? వారిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా? సానుకూలత ఉందా? ప్రతిపక్షంలో ఎవరితోనైనా టచ్‌లో ఉన్నారా? తదితర విషయాలకు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపైకానీ, వైఖరిపైకానీ ముఖ్యమంత్రి జగన్ ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు.
ఆ ఇద్దరు ఎవరో కాదు.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. అకస్మాత్తుగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు వచ్చిందనేది వైసీపీ అధిష్టానం అభిప్రాయంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఎంతో అయిష్టత చూపే ఓ దినపత్రికను ఆయన బహిరంగంగా అభినందించారు. అంతేకాదు.. 'సాక్షి' గురించి తక్కువరకం వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి వైసీపీ ఎమ్మెల్యేలెవరు 'ఈనాడు' అభినందించరు.. 'సాక్షి'ని విమర్శించరు. కానీ ఆయన బహిరంగంగానే ఇలా మాట్లాడి అధిష్టానానికి ఏమైనా సంకేతాలు పంపించారా అనే విశ్లేషణలో వైసీపీ ఉంది. మనకు అధికారం ఉందికదా అని ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు దిగవద్దని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హితవు పలికారు. నేతలనుకానీ, కార్యకర్తలను కానీ శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. కేవలం పార్టీ పరంగా ప్రత్యర్థులుగానే చూడాలన్నారు. మనకు అధికార మదం తలకెక్కితే, అధికార మదంతో వ్యవహరిస్తే ప్రజలు బుద్ధిచెప్పాల్సినరోజు కచ్చితంగా బుద్ధిచెపుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదిలావుంటే ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ జగన్ మీట నొక్కుతూ మంచిపేరు తెచ్చుకుంటున్నారని, తమకు నిధులు లేక, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు లేక చెడ్డ పేరు తెచ్చుకుంటున్నామంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.12 కోట్ల వరకు నిధులు విడుదల చేయబోతోంది. మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయి. వాటిపై పునరాలోచన చేసిన ముఖ్యమంత్రి నిధుల విడుదలకు సిద్ధపడ్డారు. కానీ రాచమల్లు, కోటంరెడ్డి వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఏం చేస్తుందనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వీరిద్దరూ ముఖ్యమంత్రి జగన్‌కు గట్టి మద్దతుదారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa