మేకప్ ఈ రోజుల్లో ఎవరి వయస్సు ఎంతా అన్నది తెలియనియడంలేదు. దీంతో మోసాలు కూడా అంతే స్థాయిలో సాగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఓ 54 ఏళ్ల మహిళ... తన మేకప్‌తో 35 ఏళ్ల వ్యక్తిని బురిడి కొట్టించింది. ఈ మహిళా అప్పటికే ముగ్గురిని పెళ్లి పేరుతో మోసం చేసిందని సమాచారం. తిరువళ్లూరులోని హరి అమ్మాయి అందంగా ఉందని ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది రోజులకే అసలు బండారం బయటపడడంతో లబోదిబో మంటున్నాడు. హరి తన తల్లి ఇంద్రాణితో జీవిస్తున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే హరికి గతంలో వివాహం కాగా.. భార్యతో విబేధాలు కారణంగా కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. దాంతో అతని తల్లి ఆయనకు మళ్లీ పెళ్లి చేయాలని సంబంధాలు చూసింది.
అలా చూస్తున్న క్రమంలో ఓ బ్రోకర్ ద్వారా పుత్తూరుకు చెందిన శరణ్య పరిచయం అయింది. ఆమె వివరాలు నచ్చడంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్నారు. 54 ఏళ్ల శరణ్య బ్యూటీ పార్లర్‌కు వెళ్లి.. మేకప్ వేసుకుని చక్కగా తయారై 34 ఏళ్ల యువతిలా పెళ్లిచూపులకు కూర్చుంది. ఆమె అందానికి ముగ్ధుడైన హరి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఎదురుకట్నంగా 25 సవర్ల బంగారం పెట్టారు. ఇద్దరికి తిరువళ్లూరులో పెళ్లి జరిగింది. పెళ్లైన తర్వాత శరణ్య వాళ్లకి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది.
భర్త జీతమంతా తనకే ఇవ్వాలని, బీరువా తాళాలు తన దగ్గరే ఉండాలని గొడవ చేయడం ప్రారంభించింది. అక్కడితో ఆగకుండా ఆస్తులన్ని తన పేరు మీద రాయాలని డిమాండ్ చేసింది. అత్త ఇంద్రాణిని కూడా ఇంటి నుంచి గెంటేసింది. ఇక ఆమె చేస్తున్న పనులకు చెక్ పెట్టాలని హరి భావించాడు. ఆ క్రమంలో ఆమె ఆధార్ కార్డు కావాలన్నాడు. శరణ్య ఆధార్ కార్డుపై కేరాఫ్ రవి అని ఉంది. ఆమె వయస్సు కూడా 54 ఏళ్లు ఉంది. వాటిని చూసిన హరి, ఇంద్రాణికి అనుమానం వచ్చి.. పోలీసులను ఆశ్రయించారు. వారి దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నిజానికి శరణ్యకు రవి అనే వ్యక్తితో వివాహం జరగడమే కాదు.. వారి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వాళ్లకు కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. అయితే కొద్ది కాలం క్రితం భర్త నుంచి విడిపోయిన శరణ్య.. తల్లి దగ్గర ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రెండో వివాహం చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలో పెళ్లిళ్ల బ్రోకర్లను కలిసి విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసేది. పేర్లు మార్చుకుని మేకప్ వేసుకుని పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురిని మోసం చేసింది. సంధ్య పేరుతో సుబ్రహ్మణ్యన్ అనే అతడిని రెండో పెళ్లి చేసుకుంది. 11 ఏళ్లు కాపురం చేసింది. అంతేకాక మొదటి భర్త రవిపై కేసు పెట్టి రూ.10 లక్షలు వసూలు చేసింది. మళ్లీ హరిని పెళ్లి చేసుకుని.. వారిని మోసం చేసింది. వాళ్లు ఫిర్యాదు చేయడంతో ఈ బామ్మ వ్యవహారం మొత్తం బట్టబయలు అయింది.