ఉన్నతహోదాలు ఉన్న వ్యక్తులు హోదాను మరిచి ప్రవర్తిస్తే సమాజం ఎటుపోతోందో ఓ సారి ఆలోచన చేయాలి. తాజాగా జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ట్రైనీ ఐఐటీ విద్యార్థిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఐఏఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు మంగళవారం తెలిపారు. శిక్షణకు వచ్చిన విద్యార్థిపై 2019 బ్యాచ్కు చెందిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రియాజ్ అహ్మద్ లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఐఏఎస్ అధికారి సయ్యద్ రియాజ్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ సూపరింటెండెంట్ అమన్ కుమార్ తెలిపారు. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 354ఏ (లైంగిక వేధింపులు), 509 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలితో సహా ఐఐటీకి చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు రాష్ట్రం వెలుపల నుంచి శిక్షణ కోసం ఖుంటికి వచ్చారని కుమార్ తెలిపారు. వారంతా శనివారం డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. పార్టీలో విద్యార్థులతో సహా అతిథులకు మద్యం సేవించినట్టు తెలుస్తుంది. అక్కడ ఒంటరిగా ఉన్న ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు అందింది.
అహ్మద్‌తోపాటు పార్టీకి హాజరైన కొంతమంది అతిథులను విచారించిన తర్వాత ప్రాథమికంగా ఆరోపణ నిజమని తేలిందని ఎస్పీ తెలిజేశారు. విద్యార్థిని వైద్యపరీక్షల నిమిత్తం పంపించామని, విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామని, అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల కస్టడీని విధించింది.